Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, ఆయన భార్య హసీన్ జహాన్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. నిజానికి షమీపై వివాహేతర సంబంధాలు, గృహహింస, మ్యాచ్ ఫిక్సింగ్ వంటి ఆరోపణల్ని చేసిన జహాన్ పై తొలిరోజుల్లో అందరిలోనూ సానుభూతి వ్యక్తమయింది. అయితే. బీసీసీఐ చేపట్టిన దర్యాప్తులో షమీ ఎలాంటి తప్పూ చేయలేదని తేలడంతో ఆమె చేసే ఇతర ఆరోపణలపైనా సందేహాలు కలిగాయి. అదే సమయంలో టీమిండియా మాజీ, ప్రస్తుత క్రికెటర్లు కూడా షమీకి మద్దతుగా నిలిచారు. ఇక జహాన్ కు షమీతో జరిగింది రెండో వివాహం కావడం, ఆమెకు అంతకుముందే ఇద్దరు పిల్లలు ఉండడం, ఆ విషయాన్ని దాచిపెట్టి తనను వివాహం చేసుకుందని షమీ చెప్పడంతో ఈ వివాదాన్ని మరో కోణం నుంచి చూడడం మొదలుపెట్టారు. ఈ తరుణంలో కోల్ కతా పోలీసులు జహాన్ చేసిన ఆరోపణలపై విచారణ సాగిస్తుండగానే… షమీకి యాక్సిడెంట్ కావడంతో… అందరికీ ఆయనపై సానుభూతి మొదలయింది. షమీ కోలుకోవడం, ఐపీఎల్ కు ఆడుతుండడంతో… నెమ్మదిగా… మీడియా ఈ వివాదాన్ని మరిచిపోయింది. అయితే జహాన్ మళ్లీ ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.
షమీపై ఆమె మరో కేసు దాఖలు చేసింది. మంగళవారం కోల్ కతాలోని ఆలీపూర్ కోర్టులో గృహహింస చట్టం 2005 కింద ఆమె పిటిషన్ వేసింది. తనకు, తన కూతురికి షమీ భరణం చెల్లించేలా ఆదేశాలివ్వాలని ఆమె కోరింది. తమ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోకుండా షమీ బ్యాంకులకు సూచనలిచ్చాడని, ఇటీవల తాను చెక్ సాయంతో డబ్బు తీసుకోవాలని ప్రయత్నించగా, డబ్బు రాలేదని, అందుకోసమే భరణం కోసం కోర్టుకెక్కానని జహాన్ చెప్పింది. జహాన్ భర్త నుంచి భరణం కోరుకోవడంలో తప్పులేదు కానీ… ఆమె ఇందుకోసం ఎంచుకున్న సందర్భంపైనే నెటిజన్లు విమర్శలు వ్యక్తంచేస్తున్నారు. ఎందుకంటే… ఇవాళ షమీ, జహాన్ ల నాలుగో పెళ్లిరోజు. వారి వివాహం జరిగి నాలుగేళ్లు పూర్తయ్యాయి. నిజానికి ఈ సందర్భాన్ని షమీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. తప్పు ఎవరిదన్న సంగతి పక్కనపెడితే… భార్య వల్ల ఇప్పుడాయన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అయినప్పటికీ షమీ… భార్యకు శుభాకాంక్షలు చెబుతూ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు. పెళ్లిరోజున భార్య తనదగ్గర లేనందుకు ఆవేదన చెందాడు.
నాలుగో పెళ్లిరోజు సందర్భంగా నా భార్యకు ఈ కేక్… మిస్ యూ జహాన్ అనే క్యాప్షన్ తో కేకు ఫొటోను షేర్ చేశాడు. షమీ ఇలా ఓ పక్క భార్య దూరమయిందని ఆవేదన చెందుతున్న సమయంలోనే జహాన్ అతనినుంచి భరణం ఇప్పించాలని కోర్టునాశ్రయించడం… విమర్శలకు తావిచ్చింది. కొందరు నెటిజన్లయితే… షమీని నేరుగా దీనిపై ప్రశ్నిస్తున్నారు. నీ నాశనం కోరుకున్న ఆమెను ఇంకా ఎలా కోరుకుంటావ్ భాయ్ అని కొందరు షమీని ఉద్దేశించి, ఇంత మంచి మనసున్న వ్యక్తిని బాధపెట్టాలని ఎలా అనిపించింది వదినా… అని మరికొందరు జహాన్ ను ఉద్దేశించి ప్రశ్నిస్తున్నారు. షమీ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాస్తవానికి ఈ వివాదంలో గమనించాల్సిన విషయం ఏంటంటే…
ఆరోపణలు చేస్తున్న జహాన్ గానీ, భార్య ఆరోపణలు నిజం కాదంటున్న షమీ గానీ… తమ వివాహ బంధానికి ముగింపు పలికేందుకు సిద్ధంగా లేరు. షమీపై ఆరోపణలు చేస్తూనే… ఆయనకు విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదని, షమీ అంటే తనకు ఎప్పటికీ ఇష్టమేనని, ఆయన తప్పులపైనే తన పోరాటమని జహాన్ చెబుతోంది. షమీ కూడా భార్య దూరమయినందుకు ఎంతగానో ఆవేదన చెందుతున్నాడు… కాలం అన్ని గాయాలను మాన్పినట్టే… కొన్నాళ్లు గడిస్తే… షమీ, జహాన్ ల మనస్ఫర్ధలు తొలగిపోయి… కేసులు సమసిపోయి… ఇద్దరూ మళ్లీ కలిసిపోతారని… వారి కుటుంబ సభ్యులు, అభిమానులు నమ్మకంతో ఉన్నారు.