హిమాచల్ ప్రదేశ్ లో భారీ వరదలు…వరదల్లో చిక్కుకున్న మంత్రి 

Heavy floods in Himachal Pradesh ...Minister stranded in floods

ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్‌లో వరదనీటికి కొండచరియలు విరిగిపడి బీభత్సం సృష్టిస్తున్నాయి. అటు ఢిల్లీ, హర్యానా, యూపీని వరదలు ముంచెత్తుతున్నాయి. తాజా వరదల్లో మృతి చెందిన వారి సంఖ్య 60కి చేరింది.

అయితే హిమాచల్ ప్రదేశ్ లో వరదల్లో చిక్కుపోయారో రాష్ట్రమంత్రి. బతుకుజీవుడా అని మూడ్రోజుల తర్వాత సిమ్లాకు చేరుకున్నారాయన. వరద సహాయక చర్యల కోసం వెళ్లిన ఆ రాష్ట్రమంత్రి ఆర్ఎల్. మార్కండ మూడుర్రోజులుగా స్పితి అనే గ్రామంలో ఇరుక్కుపోయారు. వరదల కారణంగా సిమ్లాకు వెళ్లే రహదారిని మూసేయడంతో మంత్రి ఇక్కడే చిక్కుపోయారు.

ఎలాగోలా అధికారులకు సమాచారం అందించడంతో ఇవాళ మార్కండను ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సిమ్లాకు తరలించారు  మరోవైపు చంద్రతాల్ గ్రామంలో మంచు కారణంగా 127మంది చిక్కుకున్నారు. వారందరిని సహాయక సిబ్బంది కాపాడారు. హిమాచల్ ప్రదేశ్‌లో వరదలు, కొండచరియలు కారణంగా పలుచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి.

దాంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వివిధ ప్రాంతాల్లో వరద నీటిలో 500 మంది వరకు చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు సైన్యం రంగంలోకి దిగింది. దెబ్బ తిన్న రోడ్లను అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేయిస్తున్నారు. భారీ వర్షాలకు కులు అస్తవ్యస్తంగా మారింది.

రోడ్లు బురదమయం అయ్యాయి. ఇళ్లల్లోకి నీరు రావడంతో జనం ఇబ్బందిపడుతున్నారు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని హామీర్‌పూర్‌లో వరదలకు ఓ భారీ భవనం కుప్పకూలింది.

యమున తదితర నదులు పొంగిపొర్లుతుండడంతో ఢిల్లీ, హారియానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు ముంపు పొంచి ఉంది. దాంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు.