ఈ రోజు తెల్లవారుజాము నుండీ కురుస్తున్న భారీ వర్షం కారణంగా హైదరాబాద్ నగరం తడిసి ముద్దయ్యింది. నగరం నిద్రలేవక ముందే కుండపోతగా వర్షం కురవడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్ల మీద నీరు నిలవడంతో వాహనదారుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది.
ట్రాఫిక్ స్తంభించడం, రోడ్లన్నీ జలలమయం కావడంతో ఉదయాన్నే రోడ్డెక్కిన వారికి నరకం కనిపించింది. ఎర్రమంజిల్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, కూకట్‌పల్లి, హైటెక్ సిటీ, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట వరకు రోడ్డు మీద నీరు నిలిచిపోవడంతో వాహనాలు ఎక్కడిక్కడే ఆగిపోయాయి. హైటెక్ సిటీ ప్లై ఓవర్ పూర్తిగా నీటితో నిండిపోయింది. ఇంకా వర్షం కురుస్తూనే ఉండటంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు.