ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోని ప్రజలకి భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. తమకున్న సమాచారం మేరకు నేడు, రేపు పలుచోట్ల భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారిందని, భువనేశ్వర్‌కు దగ్గరలో ఈ వాయుగుండం కేంద్రీకృతమైందని ప్రకటించింది. అటు తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని.. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురువారం కోస్తాలో విస్తారంగా, అక్కడక్కడా భారీవర్షాలు పడే అవకాశం ఉందని, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఇక కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర ఉప్పోగడంతో తుంగభద్ర డ్యాం అధికారులు మొత్తం 33 గేట్లు ఎత్తివేసి, 1.92 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బళ్లారి, రాయచూరు జిల్లాలతో పాటు కర్నూలు, తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాల నదితీర గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యాం ఇంజనీర్లు హెచ్చరికలు జారీ చేశారు.