రెండ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ?

Heavy rains in Telugu states for two days

రెండ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ముందుగా అంచనా వేసిన ప్రకారం బంగాళాఖాతంలోని వాయువ్య ప్రాంతంలో నిన్న అల్పపీడనం ఏర్పడింది. దీనికి తోడు 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

వీటి ప్రభావంతో మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నిన్న ఏపీ, తెలంగాణలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిశాయి. తెలంగాణలోని కొమ్మెరలో 39మి.మీ, హత్నూరులో 29.3, కల్హేర్ 22.3, ఇబ్రహీంపేటలో 20.5మి.మీటర్ల వర్షపాతం నమోదైంది.

నేడు అనేక ప్రాంతాల్లో భారీ వర్ష సూచన రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ముంపునకు గురైన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వరద ముంచెత్తే ప్రాంతాల్లో ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలోని లంక గ్రామాలు ఇప్పుడిప్పుడే వరద నుంచి తేరుకుంటున్నాయి. వరద ప్రవాహం తగ్గడంతో ఆయా గ్రామాల ప్రజలు బాహ్య ప్రపంచంలోకి వస్తున్నారు. అయితే ఇళ్లల్లో బురద పేరుకుపోవడంతో ప్రజలు ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి నెలకొంది.