Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారీ వర్షాలకు మరోసారి ముంబయి అతలాకుతలమవుతోంది. 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఆర్థిక రాజధానిలో జనజీవనం స్తంభించింది. ఈ ఉదయానికి ముంబైలో 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఎన్డీఆర్ఎఫ్ దళాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. కుంభవృష్టి నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాలకు రహదారులు నీటమునగడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో రన్ వే తడిగా మారింది. వారణాసి నుంచి వచ్చిన స్పైస్ జెట్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది.
183 మంది ప్రయాణికులతో ఉన్న విమానం ల్యాండ్ అయ్యే క్రమంలో రన్ వే నుంచి పక్కకు మళ్లి మట్టిలో కూరుకుపోయింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను అత్యవసర ద్వారం నుంచి బయటకు పంపించారు. దీంతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎయిర్ పోర్టులో నీటి పరిమాణం పెరుగుతుండడంతో అధికారులు అంతర్జాతీయ విమానాలను ముంబై నుంచి హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు దారి మళ్లించారు. అటు భారీ వర్షాల కారణంగా విద్యుత్ సమస్య తలెత్తడంతో సబర్బన్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పశ్చిమ, దక్షిణ మధ్య రైళ్లను రద్దు చేసిన అధికారులు కొన్ని రైళ్లను దారి మళ్లించారు.
మరోవైపు ఇళ్లల్లోనుంచి ప్రజలు బయటకు రావొద్దని సెలబ్రిటీలు ట్విట్టర్ లో సూచనలు ఇస్తున్నారు. కుంభవృష్టిపై బిగ్ బీ అమితాబ్ ట్విట్టర్ లో స్పందించారు. దేవుడు తమపై మళ్లీ ఆగ్రహంతో ఉన్నాడని, అందుకే భయంకరమైన ఉరుములు, మెరుపులతో వర్షం ముంబైని అతలాకుతలం చేస్తోందని, ప్రజలందరూ ఇళ్లల్లో జాగ్రత్తగా ఉండాలని బిగ్ బీ ట్వీట్ చేశారు. వినాయకుడి పాదాలకు తాను దండం పెడుతున్న ఫొటోను కూడా ఆయన పోస్ట్ చేశారు. బిగ్ బీ తో పాటు, దీపికా పదుకునే, అలియా భట్, ప్రియాంక చోప్రా, మాధవన్ తదితరులు కూడా వర్షాల సమయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచనలు చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.