నితిన్‌ ‘భీష్మ’ ది లవర్‌!

Nithin Left The Tamil Ratsasan Film

నితిన్‌ హీరోగా తెరకెక్కిన ‘లై’ మరియు ‘ఛలో మోహన్‌ రంగ’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. దాంతో నితిన్‌ తదుపరి చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. దిల్‌రాజు బ్యానర్‌లో నితిన్‌, రాశిఖన్నా జంటగా ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రం తెరకెక్కింది. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి అయ్యి విడుదలకు సిద్దం అవుతుంది. ఆగస్టులో సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ఇటీవలే నిర్మాత దిల్‌రాజు ప్రకటించాడు. ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రం పూర్తి కాకుండానే ఈయన ‘ఛలో’ చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేసేందుకు కమిట్‌ అయ్యాడు. ఛలో చిత్రంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు, మంచి కమర్షియల్‌ సక్సెస్‌ను నాగశౌర్యకు ఇవ్వడంతో ఈయన క్రేజ్‌ అమాంతం పెరిగింది. అందుకే వెంకీకి నితిన్‌ డేట్స్‌ ఇచ్చాడు.

వచ్చే నెల నుండి వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్‌ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో చిత్రం ప్రారంభం కాబోతుంది. ఈ సినిమాకు టైటిల్‌గా ‘భీష్మ’ను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. వరుసగా పరాజయాలతో ఉన్న నితిన్‌కు శ్రీనివాస కళ్యాణం సక్సెస్‌ ఇస్తుందనే నమ్మకం అందరిలో వ్యక్తం అవుతుంది. ఈ సమయంలోనే వెంకీ కూడా నితిన్‌కు ఒక మంచి క్యూట్‌ లవ్‌ స్టోరీని ఇస్తాడనే నమ్మకం వ్యక్తం అవుతుంది. విభిన్నంగా ఛలోను తెరకెక్కించి విమర్శకుల నుండి అభినందనలు అందుకున్న వెంకీ, నితిన్‌తో కూడా ఒక చక్కని ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తాడనే నమ్మకంను నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి నితిన్‌ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ‘భీష్మ’ ఎలాంటి ఫలితంను దక్కించుకుంటుందో అని ఇప్పటి నుండే చర్చ ప్రారంభం అయ్యింది.