యాంగ్రీ యంగ్ మన్ రాజశేఖర్ ‘గరుడవేగ’ చిత్రం తర్వాత దాదాపు సంవత్సరం గ్యాప్ తీసుకున్నాడు. ఈ సంవత్సరం గ్యాప్‌లో ఎన్నో కథలు విన్న ఈ హీరో ఎట్టకేలకు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక చిత్రంను చేస్తున్న విషయం తెల్సిందే. ‘కల్కి’ టైటిల్‌తో ఇప్పటికే సినిమా ప్రారంభం కూడా అయ్యింది. అయితే ఈ సినిమాను 1980 నేపథ్యంలో తెరకెక్కించబోతున్నారు. అందుకు సంబంధించిన ఒక భారీ సెట్టింగ్‌ను నిర్మించేందుకు నిర్మాత ఏర్పాట్లు చేస్తున్నాడు. దాదాపు రెండున్నర కోట్లను ఆ సెట్ కోసం నిర్మాత ఖర్చు చేస్తున్నట్లుగా సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. సినిమాకు సంబంధించిన దాదాపు 75 శాతం చిత్రీకరణ ఆ సెట్‌లోనే జరుపబోతున్నారు.
గత సమ్మర్‌లో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ చిత్రం విజయంలో రంగస్థలం ఊరు సెట్టింగ్ చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అటువంటి సెట్‌ను, అద్బుతంగా 1980 నేపథ్యం ఉట్టి పడేలా ‘కల్కి’ చిత్రంలో వేయించేందుకు దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుపుతున్నారు. సెట్స్ నిర్మాణం పూర్తి అయిన తర్వాత రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. రాజశేఖర్ మూవీకి రెండున్నర కోట్లతో సెట్ అంటే సినిమా ఏరేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ‘కలి’ చిత్రం వస్తుందని దర్శకుడు చెబుతున్నాడు.