దీపావళిని మన సినీ జనాలు పెద్దగా పట్టించుకోరు. ఆ సీజన్లో ఎప్పుడో ఒకసారి మాత్రమే పెద్ద సినిమాలు రిలీజవుతుంటాయి. కానీ తమిళంలో అలా కాదు. అక్కడ సంక్రాంతితో సమానంగా దీపావళిని ప్రత్యేకంగా భావిస్తారు. ఆ సీజన్లో భారీ చిత్రాలు రేసులో ఉంటాయి.
హిందీలో రంజాన్ సీజన్‌ను సల్మాన్ ఖాన్ సొంతం చేసుకున్నట్లే.. తమిళంలో దీపావళికి తరచుగా తన సినిమాలు రిలీజ్ చేస్తూ ఉంటాడు విజయ్. ఈ పండక్కే అతను తుపాకి, కత్తి లాంటి బ్లాక్‌బస్టర్లు అందుకున్నాడు. గత ఏడాది సర్కార్ సినిమా కూడా దీపావళికే రిలీజైంది.
ఇప్పుడు దీపావళి కానుకగా వస్తున్న విజయ్ సినిమా బిగిల్ మీద తమిళంలో అంచనాలు మామూలుగా లేవు. ఇంతకుముందు విజయ్‌తో తెరి, మెర్శల్ లాంటి బ్లాక్ బస్టర్లు తీసిన అట్లీ డైరెక్ట్ చేస్తున్న చిత్రమిది. ఈ సినిమా తెలుగు టైటిల్ ప్రకటించారు. విజిల్ అనే పేరు ఖరారు చేశారు. ఈ చిత్ర సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ టైటిల్ లోగోను ఆవిష్కరించాడు.
తెలుగులో పీఆర్వో టర్న్డ్ ప్రొడ్యూసర్ మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాడు. గత ఏడాది దీపావళి సీజన్లో తెలుగులో సర్కార్ సినిమానే లీడర్ అయింది. మంచి లాభాలు అందించింది. ఈసారి వెంకీ మామ దీపావళికి డౌట్ అంటున్న నేపథ్యంలో తెలుగులోనూ దీపావళి సీజన్‌ను విజయ్‌కి రాసిచ్చేసినట్లే.
ఒకప్పుడు చిన్నా చితకా తమిళ హీరోలు కూడా తెలుగులో మంచి మార్కెట్ సంపాదించుకున్న సమయంలో విజయ్ సినిమాలు రిలీజవడమే కష్టంగా ఉండేది. కానీ గత కొన్నేళ్లలో మిగతా హీరోలు మార్కెట్ కోల్పోతే ఇతను రైజ్ అయ్యాడు. బిగిల్‌కు మంచి టాక్ వస్తే తెలుగులో అతడికి బిగ్గెస్ట్ హిట్ అందుకునే అవకాశముంది.