Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పదేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర సంచలనం సృష్టించిన ఆయేషామీరా హత్యకేసు ఇప్పటికీ ఓ కొలిక్కిరాకపోవడం నిజంగా విషాదం. బీఫార్మసీ చదువుతున్న ఓ అమాయక విద్యార్థిని హత్యాచారం మిస్టరీగా మిగిలిపోవడానికి అప్పటి అధికారపార్టీ కాంగ్రెస్ కు చెందిన ఓ సీనియర్ నేత మనవడి హస్తం ఉండడమే కారణమన్న వాదన అప్పటినుంచీ వినపడుతూనే ఉంది. సత్యంబాబు అనే అమాయకుణ్ని ఇరికించి, అసలు దోషులను బయటపడేయడానికి పోలీసులు విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ హైకోర్టు జోక్యంతో ఆ దారుణానికి తెరపడింది. గత ఏడాది సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు తాజాగా మరో సంచలన తీర్పు ఇచ్చింది.
ఆయేషా మీరా హత్యకేసును మళ్లీ దర్యాప్తు చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పువెలువరించింది. దర్యాప్తు నివేదికను ఏప్రిల్ 20లోగా సమర్పించాలని పోలీస్ శాఖను ఆదేశించింది. కేసు దర్యాప్తును త్వరగా పూర్తిచేయాలని, అప్పటిదాకా పోలీస్ అధికారులను మార్చొద్దని స్పష్టంచేసింది. హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగం అన్నారు. తన కూతుర్ని పాశవికంగా హత్యచేసిన దోషులు ఇప్పటికీ తప్పించుకుతిరుగుతున్నారని, హైకోర్టు ఆదేశాలతో వారికి శిక్ష పడుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. ఆయేషా హత్యకు, సత్యంబాబుకు సంబంధం లేదని తాము మొదటినుంచీ చెబుతున్నా… ఎవరూ వినిపించుకోలేదని, అమాయకుడిని దోషిగా చూపించే ప్రయత్నంచేశారని ఆరోపించారు. అసలు దోషులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు.