తమిళనాడు మాజీ సీఎం, డీఎంకే చీఫ్ కరుణానిధి అంత్యక్రియల విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. చెన్నైలోని మెరీనా బీచ్ ఒడ్డున కరుణానిధి అంత్యక్రియలకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు. మంగళవారం అర్ధరాత్రి జడ్జీలు విచారణ జరిపారు. ఇతర నేతల అంతక్రియలకు స్థలం ఇచ్చినట్లుగానే సీనియర్ నేత కరుణానిధికి ఎందుకు ఇవ్వకూడదని న్యాయస్థానం ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తమిళనాడు ప్రముఖులు ఎంజి రామచంద్రన్, జయలలితలకు మెరీనా బీచ్ సమీపంలో అంత్యక్రియలు జరిగాయి. వారి స్మారకాలనూ ఏర్పాటు చేశారు.
అక్కడే అంత్యక్రియలకు మెరీనా బీచ్‌లో స్థలం ఇవ్వాలని డీఎంకే కార్యకర్తలు కూడా నిరసనకు దిగారు.
ప్రస్తుతం ప్రభుత్వం సర్దార్ పటేల్ రోడ్డులోని రాజాజీ, కామరాజ్ స్మారకాల పక్కనే రెండెకరాల భూమిని ఇవ్వడానికి సిద్ధమని పేర్కొంది. అయితే మెరీనా బీచ్‌లోని అన్నా సమాధి పక్కనే కరుణానిధి అంత్యక్రియలు జరపాలని డీఎంకే శ్రేణులు పట్టుబట్టినట్లు తెలుస్తోంది. అయితే ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు మెరీనా బీచ్‌లో స్థలం కేటాయించడం కుదరదని ప్రభుత్వం వేసిన పిటీషన్‌ను మద్రాసు హైకోర్టు కొట్టిపారేసింది. మెరీనా బీచ్‌లోనే కరుణ అంత్యక్రియలు నిర్వహించేలా హైకోర్టు తీర్పునిచ్చింది. కరుణానిధి అంత్యక్రియలు అన్నా మెమోరియల్ పక్కనే నిర్వహించేందుకు మద్రాస్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో నేటి సాయంత్రం ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి.