యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ త్వరలోనే రాజకీయాల్లోకి వెళ్లబోతున్న విషయం తెల్సిందే. వస్తున్నా వస్తున్నా అంటూ రజినీకాంత్ గత పది సంవత్సరాలుగా నాన్చుతూ వచ్చి ఇన్నాళ్లకు పార్టీ పెట్టేందుకు సిద్దం అయ్యాడు. ఈసమయంలోనే కమల్ హాసన్ హఠాత్తుగా రాజకీయల్లో రాబోతున్నట్లుగా ప్రకటించాడు. నేడో, రేపో కొత్త పార్టీని ప్రకటిస్తాను అంటూ కూడా కమల్ చెప్పుకొచ్చాడు. కమల్ హాసన్ తీసుకున్న నిర్ణయం తమిళ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠకు తెర లేపింది. ఈయన ప్రస్తుతం ఉన్న అన్నాడీఎంకే, డీఏంకే, బీజేపీ పార్టీలకు చాలా దూరంగా ఉండాలని భావిస్తున్నాడు.
తాజాగా ఆమ్ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసిన కమల్ హాసన్ ఆయనతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉందని చెప్పుకొచ్చాడు. ఆప్ తరహాలోనే ఒక భిన్నమైన పార్టీని కమల్ తీసుకు రావాలని నిర్ణయించుకున్నాడు. ప్రకటన త్వరలోనే ఉండబోతుంది. ఈ సమయంలోనే కమల్ హాసన్ సినిమాలకు గుడ్ బై చెప్పేయనున్నట్లుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం చేస్తున్న సినిమాల తర్వాత కొత్త సినిమాలు ఒప్పుకోకూడదని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న సినిమాలను చకచక పూర్తి చేసి ఆ తర్వాత కమల్ పూర్తిగా రాజకీయాలకు పరిమితం కాబోతున్నాడు. త్వరలోనే కమల్ హాసన్ రాజకీయ పార్టీ ప్రకటించనున్న నేపథ్యంలో సినిమాలను వదిలేయాలనుకోవడం మంచి పరిణామమే అని, ఆయన తీసుకున్న నిర్ణయం సరైనదే అంటూ ఆయన కూతుర్లు తాజాగా ప్రకటించారు. అయితే కొందరు మాత్రం కమల్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.
ఇంకా రాజకీయాలు స్టార్ట్ కాకుండానే అప్పుడే సినిమాలకు గుడ్‌బై చెప్పడం ఏంటని, ఒక పార్టీ పెట్టగానే సినిమాల్లో కూడా నటించలేనంత బిజీ కమల్ కాబోడని, ఆయన సినిమాలను కూడా కంటిన్యూ చేయడం మంచిదని కొందరు అభిప్రాయపడుతున్నారు. కమల్ హాసన్ సినిమాలతో పాటు రాజకీయాలు చేసుకోవడం మంచిది అంటూ ఆయన శ్రేయోభిలాషులు కూడా అంటున్నారు. రాజకీయాల్లో గుర్తింపు వచ్చి, ప్రజలు ఆయన్ను సీఎంగా చేసినప్పుడు సినిమాలను వదులుకోవడం లేదా, వాయిదా వేసుకోవడం చేయాలని అంటున్నారు. ఒకవేళ రాజకీయాల్లో సక్సెస్ కాకుంటే మళ్లీ రావాల్సింది సినిమాల్లోకే అని, అందుకే ముందు నుండే సినిమాల్లో కూడా అప్పుడప్పుడు కంటిన్యూ అయితే బాగుంటుందని కొందరు అంటున్నారు.