అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో ఉండే అమెరికా అధ్యక్షుడితో మాట్లాడడం మామూలు మనుషులకు సాధ్యపడుతుందా ? అస్సలు కాదు.. కనీసం ఫోన్లో మాట్లాడాలన్నా అదేమంత సులభం కాదు. కానీ, ఆ దేశానికి చెందిన కమెడియన్ ఒకరు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని బకరాని చేసి మరీ ఆయనతో ఫోన్లో సంభాషించారు. ట్రంప్ కూడా ఏమాత్రం అనుమానించకుండా సెనేటర్ అనుకునే ఆ కమెడియన్‌తో మాట్లాడారట. పూర్తి వివరాలలోకి వెళితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ప్రయాణిస్తున్నాడు. హాస్యనటుడు జాన్ మెలెండెజ్ వైట్ హౌస్ కు ఫోన్ చేసి, తాను సెనేటర్ రాబర్ట్ మెనాండెజ్ సహాయకుడినని, అత్యవసరంగా ట్రంప్ తో మాట్లాడాలని కోరడంతో వారు వెంటనే ట్రంప్ ను కాంటాక్ట్ చేశారు.
కాగా, ఈ ఘటనతో అధ్యక్షుడి ప్రొటోకాల్ నిర్వహణ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో అమలవుతున్న వలస విధానం నుంచి సుప్రీం కోర్ట్ సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఆంటోనీ కెన్నడీ పదవీ విరమణ తరువాత ఎవరు నియమితులవుతారంటూ… ఎన్నో విషయాలపై మాట్లాడాడు. గతంలో సెనేటర్ రాబర్ట్ మెనాండెజ్, ఓ కేసులో ఇరుక్కుని ఆపై నిర్దోషిగా బయటకు వచ్చాడు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకున్న ట్రంప్, “మీరు చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారన్న సంగతి నాకు తెలుసు” అని వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక ట్రంప్ తో తన సంభాషణ రికార్డును “ది స్టట్టరింగ్ జాన్ పాడ్‌కాస్ట్” అనే టైటిల్ తో జాన్ మెలెండెజ్ పోస్టు చేయగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటనపై వైట్‌హౌస్ స్పందించలేదు.