Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జూబ్లీహిల్స్ పరిధిలోని యూసఫ్ గూడ జవహర్ నగర్‌లో సోమవారం సాయంత్రం 19 ఏళ్ల యువతి వెంకటలక్ష్మి హత్య జరిగి కలకలం రేగిన సంగతి తెలిసిందే. అయితే ఈ హత్య కేసులో నిందితుడైన హోంగార్డు సాగర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పెండ్లికి నిరాకరించడంతోనే యువతిని గొంతు కోసి కిరాతకంగా హత్య చేసినట్టు హోంగార్డు సాగర్ జూబ్లీహిల్స్ పోలీసులకు వెల్లడించాడు. ఈ కేసులో సీసీ ఫుటేజీలు, సెల్‌ఫోన్ సిగ్నల్స్ అధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు ఆధారాలు సేకరించారు. సాగర్‌కు మరో ఇద్దరు సహకరించినట్లుగా అనుమానిస్తున్నారు. హతురాలు వెంకటలక్ష్మి (19)… మధురానగర్‌లోని విశ్రాంత ఐఏఎస్ అధికారి సుబ్బయ్య ఇంట్లో మూడేండ్ల క్రితం పనిమనిషిగా చేరింది. అదే ఇంట్లో డ్రైవర్ గా వంటమనిషిగా పనిచేస్తున్న నర్సంపేటకు చెందిన హోంగార్డు సాగర్(27)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. సుమారు ఏడాదిపాటు సాగిన వీరి పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ పెండ్లి చేసుకుందామనుకున్నారు.
తామిద్దరం పెండ్లి చేసుకుంటామని యజమాని సుబ్బయ్యకు కూడా ఇరువురూ చెప్పడంతో వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులను పిలిపించారు ఐఏఎస్ అధికారి సుబ్బయ్. అయితే ఇద్దరి కులాలు వేరుకావడం, సాగర్ ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో వెంకటలక్ష్మి కుటుంబం పెండ్లికి ఒప్పుకోలేదు. వెంకటలక్ష్మిని అక్కడ పని మానేయించారు. అనంతరం జవహర్‌నగర్‌లో నివాసం ఉంటున్న వెంకటలక్ష్మి ఫోన్‌నెంబర్‌ను కూడా మార్చింది. అనంతరం నగల దుకాణంలో పని వెతుక్కుంది. ఏడాది తర్వాత వెంకటలక్ష్మి ఎక్కడ ఉంటుందో తెలుసుకున్న సాగర్, ఆమె ఫోన్ నెంబర్ కూడా సేకరించాడు. ఆమె ఇంటికి కూడా వెళ్లి గొడవకు దిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆరునెలల క్రితం రోడ్డుపై వెళ్తున్న వెంకటలక్ష్మిని అడ్డంకొట్టి పెండ్లి చేసుకోవాలంటూ డిమాండ్ చేయడంతో పాటు ఆమెపై చేయిచేసుకున్నాడని అయితే ఎట్టి పరిస్థితిలోనూ నిన్ను పెండ్లి చేసుకునేది లేదంటూ వెంకటలక్ష్మి స్పష్టం చేసిందని, తాజాగా నాలుగైదు రోజుల క్రితం మరో యువకుడితో బైక్‌పై వెళ్లడం చూసిన సాగర్ అనుమానం పెంచుకున్నట్టు పోలీసుల విచారణతో తేలింది… తనను ప్రేమించకపోయినా… మరొకరితో సన్నిహితంగా ఉన్నాడని అనుమానం వచ్చిన అతను దానిని జీర్ణించుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 1.53 గంటలకు వెంకటలక్ష్మిని కలిసేందుకు షాపుకు వెళ్లిన సాగర్… ఇదే విషయంపై మరోమారు ఆమెతో గొడవ పడ్డాడు.
ఆమె ప్రతిఘటించడంతో ఆమె చాతిపై కూర్చొని బ్లేడ్‌తో గొంతు కోశాడు. ఈ సమయంలో ప్రాణాలు దక్కించుకునేందుకు వెంకటలక్ష్మి తీవ్రంగా ప్రయత్నించడంతో పాటు అతడిని వెనక్కి తోసేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. బ్లేడ్‌తో గొంతు కోసినా తన ప్రాణాలు దక్కించుకునేందుకు చున్నీని గట్టిగా కట్టుకున్న వెంకటలక్ష్మి కాసేపటికి ప్రాణాలు వదలింది. దాంతో అక్కడినుంచి సాగర్ వెళ్లిపోయాడు. ఈ మొత్తం దృశ్యాలు షాపులో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మొత్తం తొమ్మిది నిమిషాల్లోనే హత్యను ముగించుకుని బయటకు వెళ్లినట్లు సీసీ ఫుటేజీ ద్వారా తేలింది. హత్య చేసిన అనంతరం నేరుగా మధురానగర్‌లోని తాను పనిచేస్తున్న విశ్రాంత ఐఏఎస్ అధికారి సుబ్యయ్య ఇంట్లోని తన గదికి వెళ్లిన సాగర్ తెర్రాస్ మీదకు వెళ్లి దాక్కున్నాడు. కాసేపటికి హత్య విషయం బయటకు పొక్కడంతో వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు నేరుగా అక్కడకు వచ్చి సాగర్ గురించి ఆరా తీయగా… అతను అక్కడ కనిపించలేదు. మరి కాసేపటికి జూబ్లీహిల్స్ పోలీసులు కూడా అక్కడకు చేరుకుని విచారించగా సాగర్ కనిపించలేదు. సాయంత్రం టీవీలో వెంకటలక్ష్మి హత్య గురించి రావడంతో విశ్రాంత ఐఏఎస్ అధికారి సుబ్బయ్యకు అనుమానం వచ్చి ఇంటిపైకి వెళ్లి చూశాడు. అక్కడ దాక్కున్న సాగర్‌ను ప్రశ్నించడంతో తాను వెంకటలక్ష్మిని హత్యచేసినట్లు అంగీకరించాడు. ఈ విషయాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చెప్పడంతో… వారు అక్కడికి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.