Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆదివారం జరిగే ఐపీఎల్ ఫైనల్ లో ఎవరెవరు తలపడతారన్నది తేలకముందే సోషల్ మీడియాలో వైరల్ అయి తీవ్ర దుమారం రేగిన చెన్నైవర్సెస్ కోల్ కతా హాట్ స్టార్ వీడియో వెనక కథ తెలిసింది. సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య శుక్రవారం జరిగే రెండో క్వాలిఫయర్ మ్యాచ్ తర్వాతే ఫైనల్లో చెన్నైతో ఏ జట్టు తలపడుతుందన్నది తేలుతుంది. అయితే సన్ రైజర్స్ ఓడిపోయి కోల్ కతా గెలిచి… చెన్నైతో ఫైనల్ ఆడడానికి సిద్ధమయినట్టుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలోకి ఎలా చేరిందో ఎవరికీ అర్థం కాలేదు. మ్యాచ్ ఆడకుండానే కోల్ కతా ఫైనల్ కు చేరినట్టు ఎలా అనుకుంటారని, మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని సన్ రైజర్స్ అభిమానులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కామెంట్లు కొనసాగుతుండగానే నెట్టింట్లో మరో వీడియో ప్రత్యక్షమయింది.
హాట్ స్టార్ కే చెందిన వీడియోలో ఐపీఎల్ ఫైనల్ చెన్నై వర్సెస్ హైదరాబాద్ అన్నట్టుగా ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత సన్ రైజర్స్ అభిమానులు శాంతించారు. ఆ తర్వాత రెండు వీడియోల వెనక అసలు విషయం బయటకు వచ్చింది. క్వాలిఫయర్ 1లో చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ మీద గెలిచాక ఐపీఎల్ ఆన్ లైన్ ప్రసారదారు హాట్ స్టార్ చెన్నై వర్సెస్ కోల్ కతా, చెన్నై వర్సెస్ హైదరాబాద్ అని రెండు ప్రోమోలు సిద్దం చేసుకుంది. క్వాలిఫయర్ 2కు, ఫైనల్ కు ఒక్కరోజు మాత్రమే వ్యవధి ఉండడంతో ఇలా రెండు ప్రోమోలు తయారుచేసుకుంది. క్వాలిఫయర్ 2 ముగిసి విజేత ఎవరో తేలగానే… ఏ ప్రోమో కావాలంటే ఆ ప్రోమో వాడుకోవాలనుకుంది. అయితే ఈ రెండు వీడియోలు గంటల వ్యవధిలో లీకవడంతో నెట్ లో దుమారం రేగింది. రెండో వీడియో కూడా బయటకు వచ్చిన తర్వాత అభిమానులు ఇందులో ఎలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ లేదని నిర్ధారణకు వచ్చారు.