పవన్ డిమాండ్లు ఇవే !

Pawan Kalyan demands for Uddanam Kidney patients

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రెండు రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉద్ధానం కిడ్నీ బాధితులతో సమావేశమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ 48 గంటల్లో ప్రభుత్వం కిడ్నీ బాధితుల్ని ఆదుకోకపోతే నిరాహారదీక్షకు దిగుతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం తన డిమాండ్‌పై పట్టించుకోకపోవడంతో ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు శ్రీకాకుళంలో తాను బస చేస్తోన్న రిసార్టులోనే పవన్‌ నిరాహార దీక్ష చేస్తారని, రేపు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శ్రీకాకుళం పట్టణంలో ప్రజల మధ్యే పవన్‌ నిరాహార దీక్ష ఉంటుందని జనసేన ఉపాధ్యక్షుడు మహేందర్‌ రెడ్డి పేరిట జనసేన శతగ్ని టీం ఒక ప్రకటన విడుదల చేసింది. నిజానికి పవన్‌ కల్యాణ్‌ నిన్నటి నుంచి ఘనాహారాన్ని తీసుకోవడం మానేశారని అందులో పేర్కొన్నారు ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం ముందు జనసేన పలు డిమాండ్లు ఉంచింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా జనసేన ఓ సూచన చేసింది. ఉద్దానం సమస్య తమ పరిధిలోకి రాదని కేంద్ర ప్రభుత్వం తప్పించుకోరాదని… రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్రం సమన్వయం చేసుకుంటూ తగిన సహాయసహకారాలను అందించాలని కోరింది.

డిమాండ్లు ఇవే :

ఉద్దానంలోని అన్ని గ్రామాల్లో మొబైల్ స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. కిడ్నీ వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఎప్పటికప్పుడు నిర్వహించాలి.

ప్రతి డయాలసిస్ కేంద్రంలో కిడ్నీ వ్యాధులకు సంబంధించి శిక్షణ పొందిన పారా మెడికల్ సిబ్బందిని నియమించాలి. వారానికి

ఒకసారి డయాలసిస్ కేంద్రానికి నెఫ్రాలజిస్టు వెళ్లి చికిత్స అందించాలి.

డయాలసిస్ కేంద్రాలను పెంచాలి. ఈ కేంద్రాలకు అనుబంధంగా బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేయాలి.

కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మందులను ఉచితంగా అందించాలి.

డయాలసిస్ చేయించుకునేవారికి… అన్ని స్టేజుల్లో ఉన్నవారందరికీ పింఛన్లు అందించాలి.

కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలి.

శుద్ధి చేసిన నీటిని ప్రతి గడపకూ అందించాలి.

వ్యాధి ప్రబలడానికి మూలాలను అన్వేషించేందుకు పరిశోధన కేంద్రాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలి.

ముఖ్యమంత్రి స్వయంగా ఉద్దానం కిడ్నీ సమస్య, నివారణ చర్యలను పర్యవేక్షించాలి. దీని కోసం స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేయాలి.

ఉద్దానంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి.

రాష్ట్రానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిని వెంటనే నియమించాలి.

పవన్ డిమాండ్లు ఇవే ! - Telugu Bullet