Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారత్, చైనా సరిహద్దులో ఉద్రిక్తత అంతకంతకూ పెరుగుతోంది. దౌత్యపరమైన చర్చలతో సమస్య పరిష్కరించుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోంటే చైనా మాత్రం యుద్ధ బెదిరింపులు కొనసాగిస్తూనే ఉంది. రెండు నెలలుగా పరిస్థితి మెరుగుపడకపోగా అంతకంతకూ దిగజారుతోంది. దీంతో చైనాకు దీటుగా బదులిచ్చేందుకు భారత్ అన్ని సన్నాహాలు చేసుకుంటోంది. వివాదం నెలకొన్న డోక్లామ్ సరిహద్దు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించిన భారత్ అక్కడకు సైన్యాన్ని పెద్ద ఎత్తున తరలిస్తోంది. సిక్కి, అరుణాచల్ ప్రదేశ్ లోని భారత్, చైనా సరిహద్దు వద్ద కు భారీగా సైనిక బలగాలను పంపినట్టు పీటీఐ సహా కొన్ని మీడియా సంస్థల్లో వార్తలొచ్చాయి. అయితే దీనిపై ఆర్మీ అధికారులు స్పందించటం లేదు. సైన్యం అంతర్గత వ్యవహారాలను బయటకు వెల్లడించకూడదని ఆర్మీ అధికారి ఒకరు చెప్పారు. సైన్యం తరలింపుతో సరిహద్దుల్లో ఎప్పుడేం జరుగుతుందో అన్న ఆందోళన నెలకొంది. మరోవైపు భారత్ సైనిక పరంగా సన్నాహాలు చేసుకుంటూనే చైనాను ఆర్థికంగా దెబ్బతీసే చర్యలూ చేపట్టింది.
చైనాకు చెందిన 93 రకాల వస్తువులపై యాంటీ డంపింగ్ ఇంపోర్ట్ డ్యూటీ విధించింది. అటు చైనా మాత్రం బెదిరింపులను ఆపటం లేదు. డోక్లామ్ సరిహద్దు నుంచి భారత సైన్యం వెనక్కి వెళ్లిపోవాలని , లేదంటే యుద్ధంతోనే పరిష్కారం సాధిస్తామని హెచ్చరిస్తోంది. డోక్లామ్ భూభాగం తమదేనంటూ అక్కడ చైనా రోడ్డు నిర్మాణ పనులు మొదలుపెట్టటంతో ఈ వివాదం మొదలయింది. రోడ్డు నిర్మాణం పూర్తయితే భారత్ సరిహద్దు భద్రతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటం, డోక్లామ్ భారత్, భూటాన్, చైనా ట్రై జంక్షన్ కావటంతో నిర్మాణ పనులను భారత్ అడ్డుకుంటోంది. ఇందుకోసం డోక్లామ్ వద్దకు భారీగా సైనికులను పంపింది. ఆ సైన్యాన్ని ఉపసంహరించాలన్నది చైనా డిమాండ్. భారత్ నిర్ణయంపై చైనా ప్రభుత్వం, సైనికులు, ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, సైన్యాన్ని వెనక్కి పిలవకపోతే యుద్ధం తప్పదని చైనా అధికార పత్రికల్లో 50 రోజులుగా వార్తలొస్తున్నాయి.
భారత చర్యను ఇప్పటిదాకా తాము దురాక్రమణ అనలేదని, చొరబాటు మాత్రమే అంటున్నామని…పొరుగుదేశాలతో చైనా స్నేహపూర్వకంగా ఉంటుందనటానికి ఇదే ఉదాహరణ అని చైనా అధికారులు చెప్పుకొస్తున్నారు. రెండు దేశాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని భారత్ బేషరతుగా డోక్లామ్ నుంచి వైదొలగాలని కోరిన చైనా అధికారులు ఓ అడుగు ముందుకేసి పాకిస్థాన్ తరపున తాము భారత సరిహద్దులు దాటి లోపలకు వస్తే ఏం చేస్తారని ప్రశ్నించటం ద్వారా తమ నైజాన్ని బయటపెట్టుకున్నారు. చైనా వైఖరిని నిశితంగా గమనిస్తున్న భారత ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా భారీగా సైనికులను సరిహద్దులకు తరలిస్తోంది. అటు ఆర్మీకి 20 వేల కోట్లు అదనంగా కేటాయించాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. మరోవైపు చైనా వైఖరిపై అంతర్జాతీయంగానూ విమర్శలు తలెత్తుతున్నాయి. చైనా దుందుడుకు చర్యల కారణంగా భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని అమెరికా వ్యూహకర్తలు విమర్శిస్తున్నారు.
మరిన్ని వార్తలు: