పోలీసుల ముందే తన పెళ్లాం చెప్పుతో కొట్టిందని మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు భర్త కిషోర్. కృష్ణా జిల్లా చాట్రాయిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. కిశోర్, శ్యామలకు ఏడాది క్రితం వివాహం జరిగింది. పెళ్లైన వారానికే గొడవలు, విడాకులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత భర్త కిశోర్ వేధిస్తున్నారని భార్య శ్యామల పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త కిషోర్ నిత్యం వేధిస్తున్నాడని, కాపురం చేయలేనని శ్యామల పోలీసులకు గతంలో ఫిర్యాదు చేసింది. దీనిపై గ్రామ పెద్దలు, పోలీసుల సహకారంతో పంచాయితీ నిర్వహించి భర్త కిషోర్ లక్ష రూపాయలను శ్యామలకు ఇచ్చే విధంగా ఒప్పందం చేశారు. ఒప్పందం ప్రకారం లక్ష రూపాయలను కిషోర్ ఇచ్చేశాడు. గత కొద్దికాలం నుండి కిషోర్ విజయవాడలోని ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
ఈ తరుణంలో భార్య శ్యామల గురువారం చాట్రాయి పోలీసుస్టేషన్లో తనను ఇంకా భర్త కిషోర్ వేధిస్తున్నాడని పేర్కొంటూ ఫిర్యాదు చేసింది. పోలీసులు కిషోర్‌ను పోలీసుస్టేషన్‌కు పిలిపించారు. మాట్లాడుతుండగా శ్యామల పోలీసు కానిస్టేబుల్ చెప్పు తీసుకుని భర్త కిషోర్‌పై దాడి చేసింది. ఈ పరిణామంతో ఖంగుతిన్న కిషోర్ ఇంటికెళ్లి భార్య చెప్పుతో కొట్టిందన్న మనోవేదనతో సూసైడ్ నోట్ రాసుకుని, ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధిత కుటుంబానికి దళిత సంఘాలు బాసటగా నిలిచాయి. పంచాయితీకి పిలిపించి, పంచాయితీ చేస్తున్న సమయంలో భార్య భర్తపై దాడి చేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ స్టేషన్ ఎదుట కిషోర్ మృతదేహాన్ని ఉంచి ధర్నాకు దిగారు.