‘జెర్సీ’కి ఓకే చెప్పిన మహానటి

Keerthi Suresh in Nani Jersey Movie

నాని హీరోగా ‘మళ్లీ రావా’ ఫేం గౌతమ్‌ దర్శకత్వంలో ‘జెర్సీ’ అనే చిత్రం తెరకెక్కనున్న విషయం తెల్సిందే. నాని ఈ చిత్రంలో క్రికెటర్‌గా కనిపించబోతున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ను ఎంపిక చేసినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. 1990 నేపథ్యంలో రూపొందబోతున్న ఈ చిత్రం షూటింగ్‌ సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో ప్రారంభం కాబోతుంది. ‘మహానటి’ చిత్రంతో ఒక్కసారిగా స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న కీర్తి సురేష్‌ ఈ చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగులో ఈ అమ్మడు గత కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. తమిళంలో వరుసగా బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలు చేస్తున్న కీర్తి సురేష్‌ తెలుగులో కూడా మంచి ఆఫర్లు దక్కించుకుంది.

‘మహానటి’ చిత్రం తర్వాత మూడు నెలలుగా కీర్తి సురేష్‌ ఒక్క తెలుగు సినిమాకు కూడా కమిట్‌ కాలేదు. ఈమె తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుందని వార్తలు వస్తున్న సమయంలో ఈ అమ్మడు ఈ చిత్రానికి కమిట్‌ అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ చిత్రంలో నానికి జోడీగా కీర్తి సురేష్‌ అయితేనే సరైన జోడీ అని దర్శకుడు గౌతమ్‌ భావించినట్లుగా తెలుస్తోంది. అందుకే భారీ పారితోషికం అయినా కూడా కీర్తి సురేష్‌ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుందని, త్వరలోనే సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ప్రారంభించబోతున్నట్లుగా దర్శకుడు గౌతమ్‌ పేర్కొన్నాడు.