పోలీస్‌ కాబోతున్న బిగ్‌బాస్‌ హోస్ట్‌!!

Nani

యువ హీరో నాని ప్రస్తుతం తన కెరీర్‌లో చాలా బిజీగా ఉన్నాడు. ఒక వైపు ‘దేవదాసు’ చిత్రంను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. నాగార్జునతో కలిసి నటించిన ఆ మల్టీస్టారర్‌ చిత్రం దసరా కానుకగా ఈనెల చివర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ వెంటనే గౌతమ్‌ దర్శకత్వంలో ‘జెర్సీ’ అనే చిత్రంలో నటించబోతున్నాడు. ఇప్పటికే కొద్ది భాగం జెర్సీ చిత్రీకరణ పూర్తి అయినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఇక నాని ఆ తర్వాత సినిమాకు కూడా కమిట్‌ అయ్యాడు. వచ్చే ఏడాది వేసవిలో నాని హీరోగా చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కబోతుంది. విభిన్నమైన కథలు తీసుకుని సినిమాలు చేసే దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి. ఆయన దర్శకత్వంలో సినిమాలు చేయాలని పలువురు హీరోలు అనుకుంటూ ఉంటారు. కమర్షియల్‌గా కాకున్నా విమర్శకుల ప్రశంసలు అందుకునే విధంగా ఆయన చిత్రాలు ఉంటాయి.

chandrasekar yeleti And Nani

‘జెర్సీ’ విడుదలకు ముందే నాని , చంద్ర శేఖర్‌ యేలేటిల కాంబో మూవీ సెట్స్‌ పైకి వెళ్లబోతుంది. ఆ చిత్రంలో నాని పోలీస్‌గా కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. స్టోరీ లైన్‌ విన్న వెంటనే ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతుంది. విభిన్నమైన కథాంశంతో నానితో ఈ చిత్రంను యేలేటి తెరకెక్కించబోతున్నాడు. వచ్చే ఏడాది కనీసం మూడు లేదా నాలుగు సినిమాలను చేయాలనే పట్టుదలతో ఉన్న నాని బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలకు కమిట్‌ అవుతున్నాడు. పోలీస్‌గా కనిపించబోతున్న నాని ఏ స్థాయిలో ఆకట్టుకుంటాడో చూడాలి. ఇక ప్రస్తుతం నాని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్‌ షో పూర్తి కాబోతుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో జర్సీ చిత్రం షూటింగ్‌పై దృష్టి పెట్టబోతున్నాడు.