Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చదనం,పరిశుభ్రత, చక్కని నివాస వసతులు, భద్రత, ఆప్యాయంగా పలకరించే మనుషులు…హైదరాబాద్ అంటే గుర్తొచ్చేది ఇదే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరాబాద్ తెలుగు ప్రజలందరికీ అత్యంత ఇష్టమైన నగరం. గ్రామాలు, పట్టణాల్లో పెరిగిన పిల్లలకు హైదరాబాద్ లాంటి మహానగరం అంటే ఎంతో క్రేజ్. ఒక్కసారి హైదరాబాద్ లో అడుగుపెడితే..ఇక ఆ నగరంతో అనుబంధాన్ని తెంచుకోలేం. అక్కడ జీవించడం అలవాటయితే…దేశంలో ఇంకెక్కడా ఉండబుద్ది కాదు…మరీ వేడిగా, మరీ చల్లగా లేకుండా…ఎప్పుడూ అనుకూలంగా ఉండే హైదరాబాద్ జీవనానికి ప్రజలు తొందరగా అలవాటు పడిపోతారు.
ఎక్కడినుంచి వచ్చిన వారైనా నివసించడానికి అనుకూలం ఈ నగరం. మెట్రోనగరమైనప్పటికీ మధ్యతరగతికి అందుబాటులోనే ఉంటుంది. ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లోలా ఇంటి అద్దెలు, వస్తువుల ధరలు చుక్కలనంటేలా ఉండవు. ఆదాయం భారీగా లేకపోయినా…ఇక్కడ సౌకర్యవంతంగానే జీవించవచ్చు. ఇతర నగరాలతో పోలిస్తే నేరాలూ తక్కువే. ఇన్ని అనుకూలతలు ఉన్నాయి కాబట్టే దేశం మొత్తం మీద జీవించేందుకు ఉత్తమ నగరంగా నాలుగోసారి హైదరాబాద్ ప్రథమస్థానం దక్కించుకుంది. క్వాలిటీ ఆఫ్ లివింగ్ రేటింగ్ 2018 పేరుతో మెర్సర్ వార్షిక జాబితా విడుదల చేసింది. దేశంలో జీవించేందుకు ఉత్తమనగరంగా హైదరాబాద్ ఈ జాబితాలో తొలిస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో భాగ్యనగరానికి తొలిహోదా దక్కడం ఇది వరుసగా నాలుగోసారి.
తక్కువ నేరాలు, అన్నికాలాల్లోనూ ఆహ్లాదకర వాతావరణం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని హైదరాబాద్ ను ఎంపిక చేశారు. హైదరాబాద్ తో పాటు మహారాష్ట్రలోని పూణె కూడా ఉత్తమ నగరాల జాబితాలో ఉంది. దేశ రాజధాని ఢిల్లీ వరుసగా మూడోసారి అట్టడుగుస్థానంలో నిలిచింది. వాయుకాలుష్యంతో పాటు భారీ ట్రాఫిక్ తో ఢిల్లీ ఉండేకొద్దీ జనం నివసించడానికి ఆమోదయోగ్యం కాని నగరంగా మారుతోంది. దేశంలోని మిగిలిన మెట్రో నగరాలు ముంబై, కోల్ కతా, చెన్నై, బెంగళూరులన్నీ…హైదరాబాద్, పూణె కంటే వెనుకబడ్డాయి. దేశంలోనే జీవించడానికి ఉత్తమనగరంగా ఉన్న హైదరాబాద్, పూణెలు ప్రపంచవ్యాప్తంగా మాత్రం 142వస్థానంలో నిలిచాయి.
గత ఏడాది 144వ స్థానంలో ఉన్న హైదరాబాద్ ఇప్పుడు 142కు రాగా, పూణె 151 నుంచి 142వ స్థానానికి చేరింది. ప్రపంచంలోకెల్లా జీవించడానికి ఉత్తమనగరంగా ఆస్ట్రియా రాజధాని వియన్నా తొలిర్యాంక్ దక్కించుకుంది. స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ రెండో స్థానంలో న్యూజిలాండ్ లోని ఆక్లాండ్, జర్మనీలోని మ్యూనిచ్ మూడోస్థానంలో ఉన్నాయి. అమెరికాలోని రెండు ప్రముఖ నగరాలు న్యూయార్క్ కు 45వ ర్యాంక్ దక్కగా, వాషింగ్టన్ 48వస్థానం పొందింది.