ప్రపంచకప్ సెమీస్‌లో భారత జట్టు పరిస్థితులు క్లిష్టంగా మారుతున్నాయి. ఎందుకంటే వర్షం పడితే భారత్ ఫైనల్‌కు చేరుకుంటుందన్న విశ్లేషణలతో అలాగే జరగాలని కోరుకున్న అభిమానుల ఆశలపై మీద వరుణుడు నీళ్లు కుమ్మరిస్తున్నాడు. నిజానికి మంగళవారమే మ్యాచ్ ఫలితం తేలిపోవాల్సి ఉండగా వర్షం కారణంగా అది ఈరోజుకి వాయిదా పడింది. ఒకవేళ నేడు కూడా వర్షం పడి ఆటకు అంతరాయం కలిగితే భారత అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. బ్యాటింగ్‌కు సహకరించని పిచ్ వర్షం తర్వాత మరింత మందకొడిగా మారే అవకాశం ఉంది. ఫలితంగా ఎంత బలంగా బాదినా బంతి బౌండరీకి వెళ్లడం కష్టమే. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బౌండరీలు ఆశించడం అంటే అత్యాశే అవుతుంది. ఫలితంగా ఛేజింగ్ మరింత కష్టతరంగా మారొచ్చు. నేడు ఆట కొనసాగితే కివీస్ స్కోరు గరిష్టంగా 250 పరుగులకే చేరొచ్చు. సాధారణ పరిస్థితుల్లో, ముఖ్యంగా టీమిండియాకు ఇది పెద్ద సమస్యేమీ కాదు. కానీ వర్షం కారణంగా తడసిన పిచ్ జీవం కోల్పోవడమే ఇప్పుడు అసలు సమస్య. బౌలింగ్ లైనప్ బలంగా ఉన్న న్యూజిలాండ్ ను ఈ పరిస్థితుల్లో ఎదుర్కోవడం అనేది కత్తి మీద సామే అవుతుంది. వర్షం పడకుండా ఆట మళ్లీ కొనసాగితే ఎలాగోలా నెట్టుకు రావొచ్చు కానీ మళ్ళీ ఈరోజి కూడా వర్షం పడి డక్‌వర్త్-లూయిస్ పద్ధతి అమల్లోకి వస్తే మాత్రం కోహ్లీసేనకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఓవర్లు కుదించినా భారత్ ఎదుట కొండంత లక్ష్యం ఉండే అవకాశాలున్నాయి. కాబట్టి గుడ్డిలో మెల్లలా వరుణుడు అడ్డం రాకుండా ఆట కొనసాగితే భారత్ కొంత వరకు ఇబ్బందుల నుంచి బయటపడుతుంది. లేదంటే నెల విడిచి సాము చేయాల్సి ఉంటుంది. మరి నేడు మాంచస్టర్‌ను వరుణుడు వీడుతాడో లేదో వేచి చూడాలి.