నెల్లూరు జిల్లాలో మడమనూరు గ్రామంలో వారంరోజుల క్రితం జరిగిన ఆటో డ్రైవర్ చేవూరు శ్రీనివాసులు హత్య కేసును పోలీసులు ఛేదించారు. కట్టుకున్న భార్యే ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. ప్రియుడి ద్వారా ఆమె పథకం ప్రకారం భర్తను హత్య చేయించినట్టుగా తేలింది. మడమనూరుకు చెందిన చేవూరు శ్రీనివాసులు ఆటో డ్రైవర్‌గా జీవనం సాగించేవాడు. ఈనెల 28వ తేదీ రాత్రి భోజనం ముగించుకుని ఇంటి వెనక్కు వెళ్లిన అతను దుండగుల కత్తిపోట్లకు గురై మృతిచెందాడు.
హత్య జరిగిన ప్రాంతంలో మృతుడు చేవూరు శ్రీనివాసులు భార్య శారద, ఏడుపు చూసి ఎవరికైనా హృదయం ద్రవించక మానదు. గుండెలవిశేలా ఆమె ఏడుస్తుంటే భార్యా భర్తల మధ్య ఇంత ప్రేమ ఉందా ఆశ్చర్యపోక తప్పదు. అయితే భర్తను హత్య చేయించిన శారదే ఇంత గొప్పగా నటించడం బహుశా మహాంటులకి కూడా సాధ్యం కాదేమో. హత్యకు పథక రచన చేసిన సమయం కూడా ఎన్నికల రాజకీయాలకు ముడిపెట్టి తాము తెలుగుదేశం అని, వైసీపీ వాళ్లు చంపేశారని తేలికగా ఆ నెపం ఇతరులమీదకు నెట్టేసింది. ఆ గ్రామంలో శివ అనే యువకుడిపైకి నెట్టేసింది. తెలుగుదేశం నాయకులు కూడా 2లక్షలు ఆర్థిక సాయం ప్రకటించి ఓదార్చి వచ్చారు. దీన్నిబట్టి భర్తను చంపించిన శారద నటన అమోఘం. అయితే హత్య జరిగిన ప్రదేశంలో దొరికిన బీరుబాటిళ్లు, చెప్పులు, కత్తులు, తమిళనాడుకి చెందిన ఒక అగ్గిపెట్టే పోలీసులకు మంచి క్లూ ఇచ్చింది. గుడ్డిగా కేసు పెట్టకుండా పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఈక్రమంలో అనుమానిస్తున్న వ్యక్తికి హత్యతో ఎటువంటి సంబంధం లేదని తేలింది. అదే సమయంలో మృతుడి భార్య శారద వైపు నుంచి కూడా దర్యాప్తు ప్రారంభించారు. ఆమె సొంతూరు ముత్తుకూరు మండలంలోని మల్లూరులో విచారణ చేయగా ఆమెకు తమిళనాడులోని పుదుకీచలం గ్రామానికి చెందిన రాజేంద్రన్ అనే వ్యక్తితో పెళ్లికి ముందే ఏడేళ్ల నుండి వివాహేతర సంబంధం ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో రాజేంద్రన్, శారదల కాల్ డేటా ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. రాజేంద్రన్ కదలికలపై నిఘా పెట్టారు. తాజాగా రాజేంద్రన్‌తోపాటు మరో ఇద్దరు మోటార్‌బైక్‌పై నెల్లూరు వైపు వస్తున్నారు. గూడూరు సీఐ వంశీధర్ వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నారు. రాజేంద్రన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న శారద భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించింది. దీంతో ప్రియుడితో కలిసి భర్త హత్యకు పథకం వేసింది. ఈ నేపథ్యంలో రాజేంద్రన్ తమిళనాడులోని పలుతిగైమేడు గ్రామానికి చెందిన బాబు అనే వ్యక్తితోపాటు అదే గ్రామానికి చెందిన మైనర్ బాలుడితో హత్య చేసేందుకు రూ.50 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. ముందుగా అనుకున్న ప్రకారం గత నెల 28వ తేదీ రాత్రి ముగ్గురూ కలిసి మడమనూరు వచ్చి శ్రీనివాసులును వారి పశువుల దొడ్డిలో కత్తులతో పొడిచి చంపారు.ప్లాన్ చేసి మరీ మొగుడిని చంపి ఆ తర్వాత శవం వద్ద ఆమె పెడబొబ్బలు పెడుతూ విలపించడం శారద ఎంత ప్లాన్ చేసిందో అర్థం అవుతోంది.