లిక్కర్ ఫర్ సేల్: చేపల పెట్టెలతో మద్యం బాటిళ్లు తరలింపు దందా……..

కరోనా తెచ్చిన లాక్ డౌన్ ప్రజలను అల్లకల్లోలం చేస్తుంది. సరికొత్త ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. దీంతో రెండు నెలలకు పైగా ప్రజలు ఇల్లకే పరిమితమై పోయారు. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన లాక్ డౌన్ సడలింపులతో కొన్ని రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే రెండు ప్రభుత్వాలు మద్యం ధరలను భారీగా పెంచడంతో మందుబాబులు ఆందోళన చెందారు. అయితే ఏపీ కంటే తెలంగాణలోనే కాస్త తక్కువ ధరలు ఉన్నాయి. దీన్ని అవకాశంగా తీసుకున్న కొందరు అక్రమార్కులు మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ దొరికిపోయారు. దీంతో పోలీసులు సరిహదుల్లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేసి మద్యం సరఫరాను అడ్డుకుంటున్నారు.

అయితే అక్రమార్కులు అతితెలివితో కొత్త పద్ధతుల్లో లిక్కర్‌ను తరలిస్తూ పోలీసులకే సవాలు విసురుతున్నారు దందారాయుళ్లు. అదెలాగంటే… చేపల పెట్టెలో భారీగా తెలంగాణ మద్యం రవాణా చేస్తూ ఇద్దరు వ్యక్తులు దొరికిపాయారు. చాగలమర్రికి చెందిన డ్రైవర్‌ శివశంకర్‌, సహాయకుడు షాషావలి బొలేరో వాహనంలో చేపలు రవాణా చేసే పెట్టెలు తీసుకొని తెలంగాణ వైపు కర్నూలు జిల్లాలోకి ప్రవేశించారు. అయితే అక్కడ పోలీసుల తనిఖీల్లో భాగంగా కర్నూలు పోలీసులు, ఎస్‌ఈబీ అధికారులు వాహనాన్ని పరిశీలించారు. చేపల బాక్సులకు సీలు వేసి ఉండడంతో అనుమానం వచ్చి తెరిచి చూశారు. ఆ బాక్సుల్లో 1001 మద్యం సీసాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా మద్యం హైదరాబాద్‌ నుంచి తీసుకువచ్చినట్లు నిందితులు విచారణలో చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.