Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కులభూషణ్ జాదవ్ వ్యవహారం భారత్-పాక్ మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తోంది. సోమవారం ఇస్లామాబాద్ లోని పాక్ విదేశాంగ కార్యాలయంలో కులభూషణ్ ను ఆయన తల్లి అవంతి, భార్య చేతాంకుల్ కలుసుకున్న సందర్భంగా ఆ దేశం వ్యవహారశైలిపై భారత్ భగ్గుమంటోంది. మానవతాదృక్పథంతో ఈ భేటీ ఏర్పాటుచేశామని చెబుతున్న పాక్ కులభూషణ్ కుటుంబ సభ్యులతో మాత్రం అనుచితంగా ప్రవర్తించింది. భేటీకి ముందు కులభూషణ్ భార్య, తల్లి మంగళసూత్రాలు, గాజులు, బొట్టు తీసేయించింది. చేతాంకుల్ పాదరక్షలు తీసుకుని మళ్లీ తిరిగి ఇవ్వలేదు. పాక్ మీడియా కూడా వివాదాస్పదంగా వ్యవహరించింది. కులభూషణ్ తల్లిని హంతకుని తల్లిగా పిలిచింది. దీనిపై భారత్ తీవ్రస్థాయిలో మండిపడింది. పాకిస్థాన్ తీరును అనేక పార్టీల నేతలు ఖండించారు. కులభూషణ్ కుటుంబసభ్యుల పట్ల పాక్ వైఖరి తలదించుకునేలా ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబాల్, సమాజ్ వాదీ పార్టీ నాయకుడు నరేశ్ అగర్వాల్ ఆగ్రహంవ్యక్తంచేశారు. పార్లమెంట్ లోనూ దీనిపై చర్చ జరిగింది.
పాక్ వైఖరిని లోక్ సభలో ప్రతిపక్షనాయకుడు మల్లికార్జున్ ఖర్గే ఖండించారు. కులభూషణ్ ను స్వదేశానికి రప్పించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై రేపు ఉదయం 11 గంటలకు రాజ్యసభలో, 12 గంటలకు లోక్ సభలో ప్రకటనచేస్తామని విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. అటు ఈ వివాదంపై పాకిస్థాన్ స్పందించింది. ఎప్పటిలానే ఈ అంశంలోనూ ఓ కట్టుకథ చెబుతోంది. తాము కావాలని కులభూషణ్ భార్య షూ విప్పించలేదని, ఆమె షూలో ఏదో వస్తువు ఉన్నట్టు తాము గుర్తించామని, దానిని పరిశీలించేందుకే షూ తీయించామని పాక్ విదేశంగా శాఖ కార్యాలయ అధికార ప్రతినిధి మహ్మద్ ఫైజల్ చెప్పారు. భద్రతాకారణాల దృష్ట్యానే షూ తీసుకున్నామని తెలిపారు. వాటికి బదులుగా ఆమెకు కొత్త షూ ఇచ్చామన్నారు. వారి ఆభరణాలను కూడా తిరిగి ఇచ్చేసామన్నారు. ఈ విషయంలో భారత్ చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని… భేటీ అనంతరం కులభూషణ్ తల్లి పాక్ కు కృతజ్ఞతలు కూడా తెలియజేశారని ఫైజల్ చెప్పారు. భారత్ చేసే నిరాధారమైన ఆరోపణల్నితాము పట్టించుకోబోమన్నారు.