Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అద్వితీయ విజయం నమోదయింది. కోహ్లీ సేన శ్రీలంకపై ఇన్నింగ్స్ 239 పరుగుల భారీ తేడాతో అతిపెద్ద విజయాన్ని సాధించింది. గెలుపు ముంగిట మొదటి టెస్టు డ్రాగా ముగియడంతో రెండో టెస్టులో ఎలాగైనా విజయం సాధించాలని కోహ్లీసేన లక్ష్యంగా పెట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 205 పరుగులకే ఆలవుటయింది. ప్రత్యర్థి జట్టు స్కోరు తక్కువగా ఉన్నప్పటికీ భారత్ మాత్రం మ్యాచ్ ను తేలికగా తీసుకోలేదు. తొలి ఇన్నింగ్స్ లోనే విజయానికి అవసరమైన పరుగులు సాధించింది.
భారత బ్యాట్స్ మెన్ అద్భుతంగా రాణించడంతో 610 పరుగుల భారీ స్కోరు నమోదయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీతో కదం తొక్కగా మురళీ విజయ్, పుజారా, రోహిత్ శర్మ సెంచరీలు నమోదుచేశారు. ఆరు వికెట్ల నష్టానికి 610 పరుగుల వద్ద మూడోరోజు ఆటను భారత్ డిక్లేర్ చేయగా… భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నామమాత్రపు పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఒక వికెట్ నష్టానికి 21 పరగుల ఓవర్ నైట్ స్కోర్ తో నాలుగోరోజు ఆట ప్రారంభించిన శ్రీలంకపై భారత బౌలర్లు ముప్పేట దాడికి దిగారు.
లంక కెప్టెన్ దినేశ్ చండిమాల్ తప్ప శ్రీలంక బ్యాట్స్ మెన్ ఎవరూ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోవడంతో 166 పరుగులకే ఆ జట్టు కుప్పకూలింది. ఇన్నింగ్స్ 239 పరుగుల తేడాతో కోహ్లీ తన కెప్టెన్సీ లోనే ఇప్పటిదాకా అతిపెద్ద టెస్టు విజయాన్ని నమోదు చేశాడు. ఆ మాట కొస్తే కోహ్లీ కెప్టెన్సీలోనే కాదు. భారత చరిత్రలోనే అతిపెద్ద విజయం కూడా. అయితే కోహ్లీ కన్నా ముందు ద్రావిడ్ కూడా తన టెస్ట్ కెప్టెన్సీలో భారత్ కు అదిపెద్ద విజయాన్ని సాధించిపెట్టాడు.
2007లో బంగ్లాదేశ్ పై కూడా భారత్ ఇలాగే సరిగ్గా ఇన్నింగ్స్ 239 పరుగుల విజయాన్ని సాధించడం విశేషం. అతిపెద్ద టెస్ట్ విజయంగా ఇప్పటిదాకా ద్రవిడ్ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ ఇప్పుడు సమంచేశాడు. అలాగే ఈ మ్యాచ్ లో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా రికార్డుల మోత మోగించాడు. టెస్టుల్లో 300 వికెట్లు సాధించాడు.
తొలి ఇన్నింగ్స్ లో నాలుగు, రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు తీసిన అశ్విన్..మ్యాచ్ చివర్లో లాహరు గమెగె వికెట్ తీయడం ద్వారా 300 వికెట్ల క్లబ్ లో చేరాడు. అంతేకాదు టెస్ట్ ల చరిత్రలో అత్యంత వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్ గా కూడా రికార్డు సృష్టించాడు అశ్విన్. ఇప్పటిదాకా ఈ రికార్డు ఆస్ట్రేలియా బౌలర్ డెన్నిస్ లిల్లీ పై ఉంది. అతను 56 మ్యాచుల్లో 300 వికెట్లు తీయగా…అశ్విన్ 54 మ్యాచుల్లోనే ఈ ఘనత సాధించాడు.
ఈ ఏడాది 5ం టెస్టు వికెట్లు తీసిన అశ్విన్ అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన రెండో బౌలర్ గా నిలిచాడు. అలాగే వరుసగా మూడేళ్లు 50 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ గానూ అశ్విన్ రికార్డులకెక్కాడు. 2015, 2016, 2017ల్లో వరుసగా 50వికెట్లు సాధించాడు. ఆస్ట్రేలియా, శ్రీలంక బౌలింగ్ దిగ్గజాలు షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో బౌలర్ అశ్వినే. మొత్తానికి డబుల్ సెంచరీతో కోహ్లీ, 300 వికెట్ క్లబ్ లోచేరి అశ్విన్ శ్రీలంకపై సాధించిన ఇన్నింగ్స్ గెలుపులో కీలకపాత్ర పోషించారు. కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు