Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డోక్లామ్ వివాదంలో భారత్ తన పంతాన్ని నెగ్గించుకుంది. డోక్లామ్ సరిహద్దు నుంచి రెండు దేశాల సైన్యాన్ని ఒకేసారి ఉపసంహరించేందుకు భారత్ చైనా మధ్య ద్వైపాక్షిక చర్చల్లో ఒప్పందం కుదిరింది. భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. భారత్ కోరుకుంటున్నట్టుగా చర్చల ద్వారానే ఈ సమస్య పరిష్కరించుకున్నామని తెలిపింది. దీంతో రెండు నెలలుగా ఇరు దేశాల మధ్య సాగుతున్న వివాదానికి తెరపడినట్టయింది.
భారత్-భూటాన్-చైనా ట్రైం జంక్షన్ వద్ద చైనా చేపట్టిన రహదారి నిర్మాణాన్ని భూటాన్ కోరిక మేరకు భారత్ అడ్డుకోవటంతో జూన్ లో వివాదం మొదలయింది. నిర్మాణాన్ని ఆపేందుకు భారత్ డోక్లామ్ సరిహద్దు వద్ద సైన్యాన్ని మోహరించింది. చైనా కూడా భారీ ఎత్తున సైన్యాన్ని తరలించింది. అప్పటినుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తత అంతకకంతకూ పెరిగిపోయింది. ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకుందామని భారత్ పదే పదే కోరినా… ముందు భారత్ తన సైన్యాన్నిఉపసంహరించుకోవాలని, అప్పటిదాకా చర్చల ప్రసక్తే లేదని చైనా మొండివైఖరి ప్రదర్శించింది. దీంతో పరిస్థితి మరింత జటిలం అయింది ఒకానొక దశలో రెండు దేశాల మధ్య యుద్ద వాతావరణం నెలకొంది.
చైనా మీడియా భారత్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారానికి దిగింది. చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ లో రోజూ యుద్ధం తప్పదన్న హెచ్చరికలతో వార్తలొచ్చాయి. చైనా వ్యాఖ్యలకు భారత్ దీటుగానే స్పందించింది. భారత్ 1962 నాటి దేశం కాదని అరుణ్ జైట్లీ స్పందించారు. తమదీ అప్పటి చైనా కాదని… ఆ దేశం బదులిచ్చింది. ప్రపంచ దేశాల నుంచి మాత్రం భారత్ కే మద్దతు లభించింది. జపాన్ , అమెరికా వంటి దేశాలు డోక్లామ్ వివాదంలో భారత్ అనుసరిస్తున్న వైఖరిని ప్రశంసించాయి. మరోవైపు పెద్ద ఎత్తున తమ దేశ వస్తువులను భారత్ లోకి దిగుమతి చేస్తున్న చైనా పై మన ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఇబ్బడిముబ్బడిగా మార్కెట్ ను ముంచెత్తుతున్న చైనా వస్తువులపై పన్ను విధించింది. భారత సమాచారం దొంగలిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో కొన్ని చైనా మొబైల్ కంపెనీలకు నోటీసులు జారీచేసింది. అటు సోషల్ మీడియాలోనూ చైనా ఉత్పత్తులు కొనద్దంటూ వ్యతిరేక ప్రచారం జరిగింది. దేశం మొత్తం చైనా కు వ్యతిరేకంగా ఏకతాటిపైకి వచ్చిందనే చెప్పాలి.
డోక్లామ్ సరిహద్దు వివాదం తర్వాత ప్రజల్లో దేశభక్తి భావం, చైనా వ్యతిరేకత సమాంతరంగా పెరుగుతూ వచ్చాయి. మరోవైపు కయ్యానికి కాలుదువ్విన చైనాలో ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. దీనికితోడు అంతర్జాతీయ పరిస్థితులు సహకరించేలా కనిపించలేదు. దీంతో మొండిపట్టు వీడి భారత్ తో రాజీకి ఒప్పుకుంది. బ్రిక్స్ సమావేశంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి మోడీ చైనా పర్యటనకు సిద్ధమవుతున్న వేళ డోక్లామ్ నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకునేందుకు అంగీకరించింది చైనా…ఇక రెండు దేశాలు డోక్లామ్ నుంచి సరిహద్దులనుంచి సైన్యాన్ని వెనక్కు రప్పించటమే మిగిలి ఉంది.
మరిన్ని వార్తలు: