Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డోక్లామ్ సరిహద్దు వద్ద యుద్ద వాతావరణం సృష్టిస్తున్న చైనా… ఇప్పుడు మరో చోట వివాదానికి తెరలేపింది. భారత్ తో వేల కిలోమీటర్ల సరిహద్దు పంచుకుంటున్న చైనా… డోక్లామ్ చాలదన్నట్టు కాశ్మీర్ లోని లడఖ్ లోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేసింది. లడఖ్ సరిహద్దుల్లోని ఫింగర్ ఫోర్, ఫింగర్ ఫైవ్ ప్రాంతంలోకి చైనా సైనికులు చొరబాటుకు ప్రయత్నించారు. అయితే చైనా సైనికుల ఎత్తుగడలను భారత్ తిప్పికొట్టింది. ఒకేసారి రెండు చోట్ల నుంచి చొరబాటుకు ప్రయత్నించిన చైనా సైనికులను… మానవ కవచంగా ఏర్పడి అడ్డుకున్నారు భారత సైనికులు. చైనా సైనికులను ఒక్క అడుగు కూడా ముందుకు రానివ్వలేదు మనవాళ్లు. అనుకున్నది జరగకపోతే… చైనాలో అసహనం మొదలవుతుంది కదా…భారత సైనికులు అప్రమత్తంగా ఉండి తమ చొరబాటును అడ్డుకోవటంతో అసహనానికి లోనయిన చైనా సైనికులు అంతర్జాతీయ నియమాలను పక్కనబెట్టి రాళ్ల దాడికి దిగారు. ప్రతిగా ఇండియా సైనికులు అదే రీతిలో బదులిచ్చి తీవ్రంగా ప్రతిఘటించారు. పరిస్థితి మరీ చేయదాటకుండా అనంతరం బ్యానర్ డ్రిల్ జరిగింది. రెండు దేశాల సైనికులు ఎవరి స్థానానికి వారు వెళ్లిపోయారు.
వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలు తలెత్తినపుడు… పరిస్థితిని అదుపులోఉంచేందుకు బ్యానర్ డ్రిల్ జరపాలని రెండు దేశాలు 2005లో ఓ ఒప్పందానికి వచ్చాయి. దీని ప్రకారం ఓ దేశం వైపు నుంచి చొరబాటు ప్రయత్నం జరిగితే… రెండో దేశం గస్తీ సైనికులు ఫ్లాగ్ మీటింగ్ దాకా వెళ్లే పనిలేకుండా… పది అడుగుల బ్యానర్ ప్రదర్శించాలి. ఎలాంటి ఆయుధాలు ఉపయోగించకుండా బ్యానర్ ప్రదర్శించాలి. అప్పుడు తప్పనిసరిగా రెండో పక్షం యథాతథ స్థానానికి వెళ్లిపోవాలి. ఇదీ ఆ ఒప్పందం సారాంశం. ఫింగర్ ఫోర్, ఫింగర్ ఫైవ్ ప్రాంతంలో తలెత్తిన ఉద్రిక్తతలు బ్యానర్ డ్రిల్ ద్వారా చల్లారాయి. అయితే అసలు చొరబాటుకు ప్రయత్నించాల్సిన అవసరం చైనా సైనికులకు ఏముంది అంటే…
డోక్లామ్ వివాదంలో భారత్ దృష్టిని మళ్లించి మానసికంగా పై చేయి సాధించటానికి సరిహద్దులోని మరో ప్రాంతంలో వివాదానికి తెరలేపుతోందని విదేశీ వ్యవహారాల నిపుణులు అంటున్నారు. త్రిముఖ యుద్ధ వ్యూహంలో భాగంగానే చైనా ఇలా చొరబాటుకు ప్రయత్నించిందని… రానున్న రోజుల్లో సరిహద్దుల్లో మరికొన్ని చోట్ల ఇలాంటివి జరిగే అవకాశం ఉందని, భారత్ ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని వారు సూచిస్తున్నారు. ఇప్పుడే కాదు… గతంలోనూ అనేక సార్లు చైనా లడఖ్ వద్ద చొరబాటుకు ప్రయత్నించింది. ఎప్పుడూ ఏదో ఓ చోట సరిహద్దు వివాదాలు సృష్టించి… ఘర్షణకు దిగటం చైనా నైజం. డోక్లామ్ వివాదం నేపథ్యంలో మరోసారి ఇలాంటి చర్యలకు పూనుకుని తన బుద్ధిని బయటపెట్టుకుంటోంది డ్రాగన్ దేశం.
మరిన్ని వార్తలు: