Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఉగ్రవాదం విషయంలో పాక్ అనుసరిస్తున్న వైఖరి ని ఇటీవల అంతర్జాతీయ వేదికలపై తరచుగా ఎండగడుతున్న భారత్ మరోసారి అవకాశాన్ని వినియోగించుకుంది. ఈ సారి ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్ ను తూర్పారబట్టింది. ఉగ్రవాదులకు పాకిస్థాన్ స్వర్గధామంలా మారిందని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి శ్రీనివాస యాదవ్ ఆరోపించారు. ఐరాస ఫోరంలో జరిగిన శాంతి-సంస్కృతి అనే సదస్సులో ప్రసంగించిన శ్రీనివాస్ పాకిస్థాన్ పై ఘాటు విమర్శలు చేశారు.
పాక్ ఉగ్రవాదాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకుంటోందని ఆయన మండిపడ్డారు. ఉగ్రవాదులకు, ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ స్వర్గధామంగా మారిందనే విషయం అందరికీ తెలుసన్న శ్రీనివాస్ భారత భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు పాక్ వీరిని ఉపయోగించుకుంటోదని ఆరోపించారు. కాశ్మీర్…భారత్ లో అంతర్భాగమనే విషయాన్ని పాక్ కు గుర్తుచేస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. శాంతి అనేది ఓ చిహ్నం మాత్రమే కాదని, ఇరుగు పొరుగు దేశాల మధ్య సత్సంబంధాలు, పరస్పర గౌరవానికి ప్రతీక అని ఆయన తెలిపారు.
ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఉగ్రవాదులను, అతివాదులను ఎప్పుడూ అనుమతించదని, మహాత్మాగాంధీ సిద్ధాంతాలైన అహింస, శాంతిని మాత్రమే ప్రోత్సహిస్తోందని శ్రీనివాస్ వివరించారు. అతి ప్రాచీన కాలం నుంచి శాంతికి సంబంధించిన సందేశాన్ని భారత్ లో బుద్ధుడు, మహాత్ముడు వంటి ఎంతో మంది ప్రచారం చేశారు అని తెలిపారు. అటు ఈ వ్యాఖ్యలతో భారత్.. చైనాకు కౌంటర్ ఇచ్చినట్టు అయిందని విదేశీ వ్యవహారాల నిపుణులు భావిస్తున్నారు. ఉగ్రవాదంపై పోరులో పాక్‌చేసిన త్యాగం చాలా గొప్పదని, దీన్ని ప్రపంచ దేశాలు గుర్తించాలని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదాన్ని తరిమికొట్టడంలో పాక్ కీలకపాత్ర పోషిస్తోందంటూ… పాకిస్థాన్ కు చైనా శుక్రవారం బహిరంగ మద్దతు ప్రకటించింది.
ఆ తర్వాత రోజే పాకిస్థాన్ వైఖరిని ఎండగట్టటం ద్వారా భారత్ ..చైనా వ్యాఖ్యలకు సరైన రీతిలో ప్రతిస్పందించినట్టయింది. మరోవైపు చైనా ఎంత తప్పుడుప్రచారం చేసినా ప్రపంచ దేశాలు ఆ మాటలను నమ్మటం లేదు. ఆఫ్ఘనిస్థాన్ పై తన వైఖరి ప్రకటించే సమయంలోనూ, తరువాత మరో సందర్భంలోనూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పాక్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని మండిపడ్డ సంగతి తెలిసిందే.
మరిన్ని వార్తలు: