Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. గుజరాత్ లోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు డిసెంబరులో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల ప్రధాన అధికారి అచల్ కుమార్ జోతి తెలిపారు. రెండు విడతల్లో ఈ పోలింగ్ జరగనుంది. డిసెంబరు 9న తొలిదశలో 19 జిల్లాల్లోని 89 నియోజకవర్గాలకు, రెండో దశలో 14 జిల్లాల్లోని 93 నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబరు 18న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. గుజరాత్ లో మొత్తం ఓటర్ల సంఖ్య 4.33 కోట్లు. ఎన్నికల కోసం 50,128 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వివిప్యాట్ఈవీఎంలను ఏర్పాటు చేయనున్నామని, సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలతో నిఘా ఏర్పాటుచేస్తామని అచల్ కుమార్ చెప్పారు. ఎన్నికల ప్రచారానికి అభ్యర్థుల ఖర్చు రూ. 28లక్షలకు మించరాదని స్పష్టంచేశారు.
2018 జనవరి 22తో గుజరాత్ అసెంబ్లీ గడువు ముగుస్తుంది. దీంతో డిసెంబరులో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. నిజానికి హిమాచల్ ప్రదేశ్ తో పాటుగానే గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించాల్సి ఉంది. అయితే గుజరాత్ లో ఇటీవల వరదలు సంభవించడంతో… ప్రభుత్వ అధికారులు సహాయకచర్యల్లో ఉన్నారని భావించినన ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనను ఆలస్యం చేసింది. జూలైలో సంభవించిన వరదల కారణంగా… గుజరాత్ లోని ఏడు జిల్లాల్లో ప్రభుత్వ అధికారులు సహాయకచర్యల్లో పాల్గొంటున్నారని, ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు సరిపడా సిబ్బంది లేకపోవడం వల్లే హిమాచల్ ప్రదేశ్ తో పాటుగా గుజరాత్ కు షెడ్యూల్ ప్రకటించలేదని అచల్ కుమార్ చెప్పారు.
అయితే గుజరాత్ అధికారులు మాత్రం అచల్ కుమార్ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. వరద సహాయక చర్యలు ఎప్పుడో పూర్తయ్యాయని తెలిపారు. సహాయక చర్యలు దృష్ట్యా ప్రభుత్వ అధికారులు అందుబాటులో ఉండరని… తమ డిపార్ట్ మెంట్ నుంచి ఎన్నికల సంఘానికి ఎలాంటి లేఖా వెళ్లలేదని గుజరాత్ వరద సహాయక కమిషనర్ ఏజే షా చెప్పారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నప్పటికీ ఎట్టకేలకు షెడ్యూల్ విడుదలవడంతో… గుజరాత్ లో ఎన్నికల సందడి ఊపందుకుంది. ఈ ఎన్నికలను అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రెండు దశాబ్దాలుగా గుజరాత్ లో తిరుగులేని అధికారం చెలాయిస్తున్న బీజేపీ ఈ సారీ గెలుపుపై ధీమాతో ఉంది. అయితే గతంలో బీజేపీ గెలుపుకు ముఖ్యకారణమైన మోడీ… ఇప్పుడు రాష్ట్రంలో లేకపోవడం, కేంద్రప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో ఈ సారి గుజరాత్ లో కమలం వికసిస్తుందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.
దీనికితోడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గుజరాత్ లో గెలుపుకోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. త్వరలోనే కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు స్వీకరించనున్న రాహుల్ మోడీ సొంతరాష్ట్రం లో గెలుపుతో సత్తా చాటాలని భావిస్తున్నారు. తరచుగా గుజరాత్ లో పర్యటిస్తూ, బీజేపీకి, మోడీకి వ్యతిరేకంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ప్రధాని కూడా ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గుజరాత్ లో గనక బీజేపీ ఓడిపోతే… అది కేంద్రప్రభుత్వంపై తీవ్ర ప్రభావంచూపే అవకాశముంది. ఓ రకంగా చెప్పాలంటే… బీజేపీ ప్రాభవం ఆ ఓటమితో ముగిసిపోతుంది. అందుకే ఆ పరిస్థితి రాకుండా… మోడీ, అమిత్ షా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు.
దీనిలో భాగంగానే ప్రధాని సొంత రాష్ట్రంపై వరాల జల్లులు కురిపిస్తున్నారు. మోడీ, షా వ్యూహాలు సానుకూల ఫలితం సాధించేటట్టే కనిపిస్తున్నాయి. గుజరాత్ లో ఈసారీ బీజేపీనే గెలుస్తుందని ఓ సర్వేలో వెల్లడయింది. ఒక్కగుజరాత్ లోనే కాదు… హిమాచల్ ప్రదేశ్ లోనూ కమలం పార్టీనే అధికారంలోకి వస్తుందని తేల్చింది ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా ఒపీనియన్ పోల్. గుజరాత్ లోని మొత్తం 182 స్థానాల్లో బీజేపీ 115 నుంచి 125 స్థానాలు గెలుచుకునే అవకాశముందని, హిమాచల్ ప్రదేశ్ లోని 68 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 43 నుంచి 47 స్థానాల్లో విజయం సాధించవచ్చని సర్వే అంచనావేసింది.
జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు వంటి అంశాల్లో గుజరాతీలకు మోడీపై వ్యతిరేకత ఉన్నప్పటికీ… ప్రధాని వెంటే నిలవాలని వారు భావిస్తున్నారు. ఎందుకంటే గుజరాత్ కు మోడీ అన్ని రకాలుగా సాయం చేస్తున్నారని వారు నమ్ముతున్నారు. మొత్తానికి గుజరాత్ లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలని కలలు కంటున్న రాహుల్ గాంధీకి ఆ రాష్ట్రంలోనే కాక… ప్రస్తుతం అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ లోనూ పరాభవం తప్పేట్టు లేదు.