Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారత్ చైనా సరిహద్దుల్లో మళ్లీ అలజడి రేగింది. అరుణాచల్ ప్రదేశ్ సెక్టార్ లోని పలు ప్రాంతాల వద్ద భారత్ బలగాల సంఖ్యను పెంచింది. దిబాంగ్, డియో-డిలాయ్, లోహిత్ కొండ ప్రాంతాల వద్ద బలగాలు నిత్యం గస్తీ కాస్తున్నాయని, తాము ఎటువంటి సవాళ్లయినా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని ఆర్మీ అధికారులు చెప్పారు. వివాదాస్పద డోక్లామ్ సరిహద్దు వెంట చైనా హెలిపాడ్స్, సైనికస్థావరాలు, ట్రెంచెస్ ను నిర్మిస్తున్న నేపథ్యంలో భారత్ అదనపు బలగాలను మోహరించింది. ఎల్ ఏసీ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని, పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని కిబిథు ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తోన్న ఓ ఆర్మీ అధికారి వెల్లడించారు.
భారత్, చైనా, మయన్మార్ ట్రై జంక్షన్ తో పాటు ముఖ్యమైన ప్రాంతాల్లో బలగాల విస్తరణ చేశామని మరో ఆర్మీ అధికారి చెప్పారు. కిబిథు ప్రాంతానికి ఆర్మీ వస్తువులను చేరవేసేందుకు తాత్కాలికంగా నిర్మించిన వంతెన ఉపయోగిస్తున్నామని, ఎత్తయిన ప్రదేశాలకు సైన్యం వెళ్లేందుకు అనువుగా ఉండేందుకు, దిబాంగ్, లోహిత్ ప్రాంతాల్లో రహదారి నిర్మాణ పనులు ప్రారంభించడానికి అనుమతులు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని సీనియర్ అదికారి చెప్పారు. ఊహించని విధంగా వచ్చే పరిస్థితులను ఎదుర్కోడానికి సిద్దంగా ఉన్నామని రక్షణ శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ వ్యాఖ్యానించిన తర్వాత భారత్ అదనపు బలగాలు మోహరించడం చూస్తే..డోక్లామ్ వివాదం తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.