రైలు ప్రయాణం చేస్తున్నారా ?…మోత మోగిపోవచ్చు జాగ్రత్త !

IRCTC Luggage Charges In Increased

రైలు ప్రయాణికులు పరిమితికి మించి లగేజీ తీసుకొస్తే ఫైన్ ల మోత మొగించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించి 30 ఏళ్ల కిందట రూపొందించిన విధివిధానాలను ప్రస్తుతం అమలు చేయనుంది. తాజా నిబంధనల ప్రకారం పరిమితికి మించి లగేజీ తమ వెంట తీసుకెళ్తే దీని ధరకు ఆరు రెట్ల మొత్తాన్ని జరిమానాగా విధించనున్నారు. నిన్న పార్లమెంట్ లో రైల్వే ప్రయాణికులు అదనపు లగేజీకి సంబంధించి లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగి ప్రశ్నకు ఆ శాఖ సహాయ మంత్రి రాజన్ గొహెయిన్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

దాని ప్రకారం ప్రస్తుతం స్లీపర్‌ క్లాస్‌ అయితే 40 కిలోలు, సెకండ్‌ క్లాస్‌ అయితే 35 కిలోలు, ఫస్ట్‌/టైర్‌2 ఏసీలో 50 కిలోలు, ఫస్ట్‌ ఏసీలో 70 కిలోల వరకు లగేజీని ఉచితంగా తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే, గరిష్ఠ పరిమితి తర్వాత కూడా నిర్ణీత అదనపు ధర చెల్లించి మరింత లగేజీని తీసుకుపోవచ్చు. దీని ప్రకారం సెకండ్‌ క్లాస్‌‌లో 70 కిలోలు, స్లీపర్‌ క్లాస్‌‌లో 80 కిలోలు, ఏసీ 3టైర్‌/ఏసీ చైర్‌ కార్‌‌లో 40 కిలోలు, ఫస్ట్‌ క్లాస్‌/ ఏసీ టైర్‌ 2లో 100 కిలోలు, ఫస్ట్‌ ఏసీలో 150 కిలోల దాకా గరిష్ఠంగా లగేజీని తీసుకెళ్లే సదుపాయం ఉందని, దీనిని నిర్దేశిత బోగీలో ఉంచాల్సి ఉంటుందని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న లగేజీ చార్జీల కంటే అదనంగా ఒకటిన్నర రెట్లు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇలా కాక అదనపు లగేజీకి ఎటువంటి టికెట్ లేకుండా టీసీకి దొరికారో ఆ ప్రయాణ చార్జీకి ఆరు రెట్లు డబ్బు కట్టాల్సి ఉంటుంది.