Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Investigation On Gorakhpur Tragedy
గోరఖ్ పూర్ బీఆర్ డీ ఆస్పత్రిలో చిన్నారులు మరణించిన విషాదంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. ఆస్పత్రిని సందర్శించిన ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ చిన్నారుల తల్లిదండ్రులను పరామర్శించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వదిలిపెట్టబోమని సీఎం హెచ్చరించారు. గత నెలలోనే తాను రెండుసార్లు ఈ ఆస్పత్రిలో పర్యటించానని కానీ ఒక్కరూ ఈ సమస్యను తన దృష్టికి తీసుకురాలేదని ఆయన మండిపడ్డారు. కాలేజీ యాజమాన్యంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికే వైద్య కళాశాల ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేశామని, నిర్లక్ష్యం, బాధ్యతారహిత్యంతో వ్యవహరించిన ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ఘటనలో ఆక్సిజన్ సరఫరాదారు పాత్రపైనా విచారణ చేపడతామని తెలిపారు. గోరఖ్ పూర్ లో తీవ్రంగా ఉన్న మెదడువ్యాపి వ్యాధిపై తాను 1996 నుంచే పోరాడుతున్నానని,
90 లక్షలమందికి పైగా చిన్నారులకు ఎన్ సెఫలైటిస్ వ్యాక్సిన్లు ఇచ్చానని ఆదిత్యనాథ్ చెప్పారు. చిన్నారుల పట్ల తనకంటే శ్రద్ధ చూపిన వారు మరెవరూ లేరన్నారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆందోళన చెందుతున్నారని, అన్ని విధాలా సహాయం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ఢిల్లీ నుంచి ఓ వైద్య బృందం వచ్చిందని, బీఆర్ డీ ఆస్పత్రిలో చిన్నారులకు ఆక్సిజన్ అందించేందుకు అన్ని చర్యలూ తీసుకున్నామని చెప్పారు. అటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ విషాదంపై యూపీ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. గోరఖ్ పూర్ ఘటనకు నిరసనగా యోగీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.