చేతబడిపై మీకు నమ్మకం ఉందా ? కానీ కర్నాటకలో బ్ల్యాక్ మ్యాజిక్ ఎక్కువే ! సీఎం కుమారస్వామి సోదరుడు, మంత్రి రెవన్నా ఇవాళ అసెంబ్లీకి నిమ్మకాయ పట్టుకుని ఎంట్రీ ఇచ్చారు. దీంతో బీజేపీ సభ్యులు గగ్గోలు పెట్టారు. రెవన్నా చేతబడికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆ సందర్భంలో సీఎం మాట్లాడారు. బీజేపీకి చెందిన మీరు హిందూ సాంప్రదాయాన్ని నమ్ముతారా ? నిమ్మకాయతో వస్తే రెవన్నాను అనుమానిస్తారా అని సీఎం కుమారస్వామి అన్నారు. ఆలయానికి వెళ్లినా.. రెవన్నా తన చేతిలో నిమ్మకాయ పట్టుకుని వెళ్తారన్నారు. కానీ చేతబడి చేశారని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. చేతబడితో ప్రభుత్వాన్ని రక్షించడం సాధ్యం అవుతుందా అని సీఎం కుమారస్వామి అన్నారు. బలపరీక్ష తీర్మానంపై మాట్లాడుతూ మీ(బీజేపీ) జిల్లాలకు కూడా మొత్తం నిధులు ఇచ్చానని, కానీ మీరు నన్ను రెండుమూడు జిల్లాలకే సీఎం అనడం సరికాదన్నారు. అందుకే తొందరపాటు వద్దు అని, అన్ని అంశాలు చర్చించన తర్వాతనే బలపరీక్షపై ఓటింగ్ జరుగుతుందని సీఎం తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేయవద్దు అని అన్నారు. ఇంకా 20 మంది సభ్యులు మాట్లాడాల్సి ఉందని, ఇవాళ ఓటింగ్ జరగడం కష్టమే అని మాజీ సీఎం సిద్ధరామయ్య తెలిపారు. సభ మళ్లీ సోమవారం సమావేశం అయ్యే సూచనలు ఉన్నాయన్నారు.