Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి ప్రయోగించిన అధునాతన ఉపగ్రహం జీశాట్ -6ఏతో సంబంధాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. జీశాట్ -6ఏ నుంచి ఎలాంటి సమాచారం అందడం లేదని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఉపగ్రహానికి సంబంధించి చివరిదైన మూడో లామ్ ఇంజిన్ ను మండించిన సమయం నుంచి దానితో అనుసంధానం కోల్పోయామని చెప్పారు. మార్చి 30 ఉదయం 9.22నిమిషాలకు ఉపగ్రహం నుంచి చివరిసారిగా సమాచారం అందిందని, మొదటిసారి కక్ష్య పెంపు ప్రక్రియ చేపట్టిన సమయంలో సమాచారాన్ని చేరవేసిందని తెలిపారు. తర్వాత రెండోసారి కక్ష్య పెంపు మార్చి 31న చేపట్టామని, ఉపగ్రహంతో అనుసంధానం కావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇస్రో అధికారులు వెల్లడించారు.
భారత్ అభివృద్ధి చేసిన అతిపెద్ద రాకెట్లలో రెండోదైన జీశాట్ -6ఏ ఉపగ్రహ ప్రయోగం గురువారం విజయవంతంగా ముగిసింది. జీఎస్ ఎల్ వీ జీశాట్ -6ఏ ఉపగ్రహాన్ని నిర్ణీతకక్ష్యలోకి చేర్చడానికి ప్రయోగం తరువాత 17 నిమిషాల సమయం పట్టింది. జీశాట్ -6ఏ మల్టీబీమ్ కవరేజీ సౌకర్యం ద్వారా దేశవ్యాప్తంగా మొబైల్ కమ్యూనికేషన్ అందించనుంది. దేశంలో కమ్యూనికేషన్ దశను, దిశను మార్చివేస్తుందని భావించిన.. ఉపగ్రహం నుంచి సమాచారం అందకపోవడంపై శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.