Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఫేస్ బుక్ లోని కోట్లాదిమంది యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని కేంబ్రిడ్జ్ అనలిటికా అనే సంస్థ దుర్వినియోగం చేసిందన్న వార్త ల నేపథ్యంలో భారత్ స్పందించింది. భారత ఎన్నికల ప్రక్రియను ఫేస్ బుక్ ఏ మాత్రం ప్రభావితం చేసినా సహించబోయేది లేదని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించారు. అవసరమైతే ఫేస్ బుక్ పై ఎలాంటి కఠినచర్యలైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సోషల్ మీడియా ద్వారా పత్రికా స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛ కు ప్రభుత్వం ఎప్పటికీ మద్దతు ఇస్తుందని తెలిపారు. దాదాపు 20 కోట్ల మంది భారతీయులు ఫేస్ బుక్ ఉపయోగిస్తున్నారని, అమెరికా తర్వాత ఫేస్ బుక్ కు భారత్ అతిపెద్ద మార్కెట్ గా ఉందని వెల్లడించారు. డేటా చోరీకి సంబంధించి ఏవైనా ఉల్లంఘనలు జరిగినట్టు తమ దృష్టికి వస్తే ఐటీ చట్టం కింద తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఫేస్ బుక్ సహా అన్ని సామాజిక మాధ్యమాలనూ కేంద్రమంత్రి హెచ్చరించారు.
భారత్ లో ఐటీ శాఖ గురించి ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ కు తెలుసని, ఫేస్ బుక్ ద్వారా భారతీయులకు సంబంధించిన ఎలాంటి డేటా అయినా అపహరణకు గురైతే దాన్ని ఎంతమాత్రం సహించబోమని, ఐటీ చట్టం కింద కఠిన శిక్షలుంటాయని, ఆయనకు సమన్లు పంపే అధికారం కూడా భారత్ కు ఉందని రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించారు. కేంబ్రిడ్జి అనాలిటికాతో కాంగ్రెస్ పార్టీకి సంబంధాలున్నాయని ఆరోపించారు. డేటాను దొంగలించడం లేదా తారుమారు చేసి గెలవడంపైనే కాంగ్రెస్ ఆధారపడుతుందా అని ప్రశ్నించిన ఆయన ఒకవేళ రాహుల్ గెలుపొందితే అందులో కేంబ్రిడ్జి అనలిటికా పాత్ర ఏంటని, ఎంతమంది భారతీయుల డేటాను ఆ సంస్థ సీఈవోకు కాంగ్రెస్ ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కోసం పనిచేసిన కేంబ్రిడ్జి అనలిటికా వద్ద దాదాపు 5 కోట్ల మంది ఫేస్ బుక్ ఖాతాల సమాచారం చిక్కిందని వార్తలొచ్చాయి. ఈ లీక్ పై సమగ్ర విచారణ జరగాల్సిందేనని అమెరికా, బ్రిటన్ తదితర దేశాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి.
దీనిపై వివరణ ఇవ్వాలని ఇప్పటికే బ్రిటన్ పార్లమెంటరీ కమిటీ… జుకర్ బర్గ్ కు నోటీసులు పంపడంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు బ్రేన్ ఆక్టన్ అయితే ఫేస్ బుక్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది ఫేస్ బుక్ ను డిలీట్ చేయాల్సిన సమయమని ట్వీట్ చేశారు. ఫేస్ బుక్ పై తమకు విశ్వాసం పోతోందని ఇప్పటికే పలువురు యూజర్లు ఇతర సోషల్ మీడియాల ద్వారా తమ అసంతృప్తిని వెల్లడించారు. రెండు, మూడు రోజుల నుంచి డిలీట్ ఫేస్ బుక్ హ్యాష్ ట్యాగ్ వైరల్ గా మారింది.