భోఫోర్స్ కేసులో సీబీఐకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో 2005లో హిందుజా సోదరులను నిర్దోషులుగా ప్రకటించడాన్ని తాజాగా సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అయితే తాజాగా సీబీఐ వినతిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. సీబీఐ ఆలస్యంగా అప్పీల్ చేసిందని ధర్మాసనం పేర్కొంది. 1986, మార్చి 24న భారత్ స్వీడన్‌కు చెందిన ఆయుధాల తయారీ సంస్థ ఏబీ బోఫోర్స్‌తో 400 యూనిట్ల హౌఇట్జర్ తుపాకుల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ రూ. 1437 కోట్లు భారత ఆర్మీని బలోపేతం చేసేందుకు నాడు ఈ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ ఒప్పందంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు విమర్శలు వచ్చాయి.
ఈ క్రమంలోనే నాటి ప్రధానిగా ఉన్న రాజీవ్‌గాంధీకి ముడుపులు ముట్టాయన్న ఆరోపణలు వచ్చాయి. ఈ డీల్‌కు సంబంధించి రూ.64కోట్ల అవినీతి జరిగిందని కేసు నమోదైంది. ఈ కేసులో పలువురు ప్రముఖులతో పాటు హిందూజా సోదరులు కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2005 మే 31న బోఫోర్స్‌కు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరిపైనా కేసు కొట్టేసింది ఢిల్లీ హైకోర్టు. ఇందులో మధ్యవర్తులుగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొన్న హిందూజా సోదరులపైన కూడా కేసు కొట్టేసింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ కోర్టు 13 ఏళ్ల తరువాత ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత హైకోర్టు తీర్పును సవాలు చేసేందుకు అనుమతి ఇవ్వడంతో సీబీఐ ఈ ఏడాది ఫిబ్రవరి 2న అప్పీల్ చేసింది. అయితే 13 ఏళ్ల తర్వాత ఇప్పుడు తీర్పును సవాలు చేయడాన్ని జస్టిస్ రంజన్ గొగోయ్ తప్పుపట్టారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం 90రోజుల్లో అప్పీలు దాఖలు చేయాలి. అయితే దాదాపు 4,500 రోజుల ఆలస్యం తర్వాత సీబీఐ అప్పీలు దాఖలు చేయడం అంగీకరించే విధంగా లేదని న్యాయమూర్తి అన్నారు.
ఈ క్రమంలోనే ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థిస్తూ సర్వోన్నత న్యాయస్థానం కేసును కొట్టివేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఊరట లభించినట్టు అయింది. ఎన్నికలకు ముందు సుప్రీంకోర్టు తీర్పు కాంగ్రెస్‌కు మంచి విజయంగా భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు. అయితే రాఫెల్ డీల్‌పై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. నష్టాల్లో ఉన్న కంపెనీకి 248 కోట్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. రాఫెల్ స్కాం వెనుక మోడీ, అంబానీ ఇద్దరే ఉన్నారన్నారు. ఈ ఒప్పందంలో భారీ స్కాం ఉందని.. రహస్య ఒప్పందంలో రాఫెల్ ధర లేనే లేదని చెప్పారు. ఈ ఒప్పందాన్నంతా డీల్ చేసింది మోడీనేనని ఆరోపించారు.