Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారత్… ముఖ్యంగా హైదరాబాద్ ఇప్పుడు ఇవాంకా ట్రంప్ నామస్మరణ చేస్తోంది. భారత్ లోని టీవీ చానళ్లుతో పాటు సోషల్ మీడియా నిండా ఇవాంకాకు సంబంధించిన సంగతులు, వార్తలే కనిపిస్తున్నాయి. తెల్లవారుజామున 2.30 గంటలకు శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఇవాంకాకు తెలంగాణ మంత్రులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి భారీ భద్రత మధ్య ఆమె ప్రత్యేక వాహనంలో మాదాపూర్ లోని ట్రైడెంట్ హోటల్ కు చేరుకున్నారు. ఇవాంకాకు కనీవినీ ఎరుగని రీతిలో భద్రత కల్పించారు. ఆమె కాన్వాయ్ లో భారీ సంఖ్యలో వాహనాలున్నాయి.
తన పర్యటనలో భాగంగా ఇవాంకా ముందుగా ఈ మధ్యాహ్నం భారత విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ తో హెచ్ఐసీసీలోని రెండో అంతస్తులో భేటీ అవుతారు. తర్వాత ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా కలుస్తారు. అనంతరం ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సులో పాల్గొన్న తర్వాత మోడీ, ఇవాంకా ఫలక్ నుమా ప్యాలెస్ చేరుకుంటారు. విందు అనంతరం రాత్రి 10.45 గంటలకు తిరిగి తాను బస చేసిన ట్రైడెంట్ హోటల్ కు చేరుకుంటారు. రేపు ఉదయం ఇవాంక హెచ్ ఐసీసీలోని సదస్సుకు హాజరై… మధ్యాహ్నం 12గంటల తర్వాత బయటికి వెళ్లనున్నారు. అయితే ఆమె ఎక్కడకు వెళ్తారనే విషయాన్ని భద్రతా బలగాలు రహస్యంగా ఉంచుతున్నాయి. మధ్యాహ్న భోజన అనంతరం తిరిగి ట్రైడెంట్ హోటల్ కు చేరుకుంటారు. అక్కడ అమెరికా ప్రతినిధులతో భేటీ అవుతారు. రాత్రి 9.20 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ బయలుదేరి వెళ్లడంతో ఆమె రెండురోజుల పర్యటన ముగుస్తుంది.
హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఇవాంకా ట్రైమ్స్ ఆఫ్ ఇండియాకు ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు. భారత చరిత్ర, సంస్కృతి అంటే తనకు ఇష్టమని తెలిపారు. జీఈఎస్ లో 50శాతం మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు పాల్గొంటున్నారని, వారి సత్తా చాటేందుకు ఇది సరైన అంతర్జాతీయ వేదిక అని అభిప్రాయపడ్డారు. గతంలో న్యూయార్క్ లో భారత విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ తో తాను భేటీ అయ్యానని, మహిళల పురోగతిపై తన ఆశయాలను ఆమెకు వివరించానని చెప్పారు. ప్రధాని మోడీతో భేటీలో అవే అంశాలను మరోసారి మాట్లాడతానని తెలిపారు. అటు ఇవాళ జరిగే పారిశ్రామిక సదస్సులో పాల్గొనే వారంతా… ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. సదస్సుకు పాల్గొనేందుకు 170 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. వారంతా ఫలక్ నుమా ప్యాలెస్ లో ప్రధాని ఇచ్చే విందులో పాల్గొననున్నారు. వారందరినీ హెచ్ ఐ సీసీ నుంచి 45 బస్సుల్లో ప్యాలెస్ కు చేరుస్తారని తెలుస్తోంది. వారందరినీ ప్యాలెస్ కు చేర్చడం పోలీసులకు అతిపెద్ద సవాల్ కానుంది. సాయంత్రం ఐదుగంటలకు సదస్సు ముగుస్తుంది. తొలుత ప్రధాని మోడీ కాన్వాయ్, తర్వాత ఇవాంకా కాన్వాయ్, ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రుల కాన్వాయ్ లను అనుమతించి, అనంతరం ప్రతినిధులను తీసుకువెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకోసం మాదాపూర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు, రాజేంద్రనగర్, ఫలక్ నుమాకు వెళ్లే రహదారిని ఖాళీగా ఉంచాలని నిర్ణయించారు. విందులో పాల్గొనేవారంతా హెచ్ ఐసీసీ నుంచి ఫలక్ నుమా ప్యాలెస్ చేరుకోడానికి 30 నుంచి 40 నిమిషాల సమయం పట్టే అవకాశముంది.