Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ కు రావడమేమో గానీ… నగర పోలీసులకు కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. ఎన్నో అంతర్జాతీయ కార్యక్రమాలకు వేదికగా నిలిచిన హైదరాబాద్ లో ప్రముఖులకు భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉంటాయి. అయితే అమెరికా సీక్రెట్ సర్వీస్ కు సహజంగానే ఏ దేశభద్రత మీదా నమ్మకం ఉండదు కాబట్టి… వారు తమ సొంత ఏర్పాట్లు తాము చేసుకుంటారు. అధ్యక్షుడు, ఆయన కుటుంబ సభ్యులు ఏ దేశానికెళ్లినా సీక్రెట్ సర్వీస్ సొంత భద్రత కల్పిస్తుంది. ఈ క్రమంలో స్థానిక పోలీసులకు వారు ఇచ్చే ఆదేశాలు పాటించడం చాలా సార్లు కష్టమవుతుంది. ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో నగర పోలీసులకు కూడా ఇలాంటి సమస్యే ఎదుయింది.
విదేశీ ప్రతినిధి హోదాలో ఇవాంకాకు సంబంధించిన భద్రతను ప్రత్యేక భద్రతాదళం, రాష్ట్ర ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ విభాగాలు నిర్వహిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు, ఎస్పీజీ, గ్రే హౌండ్స్ అధికారులను సమన్వయం చేసుకుంటూ ఇంటెలిజెన్స్ అధికారి ఎం.కె. సింగ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సిటీ పోలీస్ తరపున 2వేల మంది పోలీసులను భద్రతకు వినియోగిస్తున్నారు. ఇలా కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నా అమెరికా సీక్రెట్ సర్వీస్ కు సంతృప్తి కలగడంలేదు. రోజుకో కొత్త నిబంధన తెస్తూ హైదరాబాద్ పోలీసులను ఇరకాటంలో పడేస్తున్నారు. హైదరాబాద్ లో రాష్ట్ర ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ తదితర విభాగాలతో ఇవాంక భద్రతపై సమీక్ష జరిపిన సీక్రెట్ సర్వీస్ అధికారులు… ఆచరణ సాధ్యం కాని నిబంధనలు విధిస్తున్నారు. ఇవాంకా పాల్గొనే హెచ్ఐసీసీలో జరిగే కార్యక్రమానికి బందోబస్సు నిర్వహించే పోలీసులెవరి దగ్గరా ఆయుధాలు ఉండకూడదని ఇప్పటికే నిబంధన విధించిన సీక్రెట్ సర్వీస్ అధికారులు తాజాగా… అక్కడి పోలీసులెవరూ యూనిఫాం సైతం ధరించకూడదని ఆంక్షలు విధించింది. ఈ నిబంధనలు చూసి హైదరాబాద్ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. దీనికి ప్రత్యామ్నాయం ఆలోచించే పనిలో పడ్డారు.