Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్పం పేరిట చేస్తున్న పాదయాత్ర నేడు అనంతపురం జిల్లా పెద్ద ఒడగూరు గుండా సాగింది. అక్కడ బహిరంగ సభలో ఎప్పటిలాగానే సీఎం చంద్రబాబు మీద జగన్ ఫైర్ అయ్యారు. ఓ ప్రతిపక్ష నేతగా ప్రభుత్వ వైఫల్యాలను జగన్ ఎండగట్టాలి అనుకోవడంలో తప్పులేదు. నిజానికి ఆ బాధ్యత మరిచిపోతేనే తప్పు. అయితే ఆ విమర్శలు ఎలా ఉండాలి అన్నదానిపై ఇప్పటికీ జగన్ కి అవగాహన లేదనిపిస్తోంది. నంద్యాల ఎన్నికల ప్రచారంలో ఇలాగే బాబుని కాల్చిపారేసినా తప్పు లేదని నోటికి వచ్చినట్టు మాట్లాడి ఫలితం అనుభవించారు జగన్. అయినా ఆయన ధోరణి పెద్దగా మారలేదు.
పెద్ద ఒడగూరు బహిరంగసభలో చంద్రబాబు దక్షిణ కొరియా పర్యటనలో వున్న విషయాన్ని జగన్ ప్రస్తావించారు. ఓ వైపు అనంతపురం జిల్లాలో కొరియా సంస్థలు భారీ పెట్టుబడులు పెడుతున్న విషయాన్ని ప్రకటించినా పట్టించుకోని జగన్ చంద్రబాబు మొహం చూసి ఎవడు పెట్టుబడులు పెడతాడని ప్రశ్నించాడు. అయినా నాయకుడు అందాన్ని చూసి ఎవరూ పెట్టుబడులు పెట్టరు. జగన్ చెప్పినట్టు మొహాలు చూసి పెట్టుబడులు పెట్టేట్టు అయితే బ్యూటీ క్వీన్ లను విదేశీ మీటింగ్ లకి పంపేవారు. పెట్టుబడులు కోరే చోట మౌలిక సదుపాయాలు, అక్కడ నాయకుల సమర్ధత ఆధారంగా పెట్టుబడులు వస్తాయి. ఇదేమీ పట్టించుకోకుండా చంద్రబాబు అందం గురించి మాట్లాడితే జగన్ కి ఒరిగేది ఏమీ ఉండదు. నష్టం తప్ప. నాయకుడుగా ఆయనకు సంస్కారం ఉన్నా, లేకున్నా వాటిని విని తీర్పు ఇచ్చే ప్రజలు సంస్కారవంతులు. అది పట్టకుండా మాట్లాడితే నంద్యాల ఫలితాలే 2019 లో కూడా వస్తాయి. అందుకే వైసీపీ శ్రేణులు కాస్త సంస్కారం ప్లీజ్ అని తమ నాయకుడినే వేడుకుంటున్నాయి.