దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమవడం రాష్ట్రంలోనూ కేసుల సంఖ్య 12కు చేరడంతో ఆంధ్రప్రదేశ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం జగన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను హోంమంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు. కరోనా నివారణకు నిరంతర పర్యవేక్షణకు కమిటీని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. ఐదుగురు మంత్రులతో ఆ కమిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసింది. మంత్రులు ఆళ్లనాని బుగ్గన బొత్స మేకతోటి సుచరిత కన్నబాబులతో నిరంతర పర్యవేక్షణ కమిటీని వేశారు. ఈ కమిటీ రోజూ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి కరోనా కట్టడికి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీనికి అవసరమైన మేరకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
దీంతో పాటు మూడు నెలల బడ్జెట్‌కు ఆమోదం తీసుకుంటూ ఆర్డినెన్స్ జారీకి ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రివర్గానికి కరోనా వైరస్ వ్యాప్తి నిరోధకానికి తీసుకుంటున్న చర్యలను వెద్యశాఖ ఉన్నతాధికారులు వివరించారని సమాచారం. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలపై ప్రతి జిల్లాకు రూ. 2 కోట్లు చొప్పున కేటాయించాలని నిర్ణయించారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి – లాక్ డౌన్ తో రాష్ట్ర ఆర్థిక ప్రగతి కుదేలైందని మంత్రివర్గం ఆందోళన వ్యక్తం చేసింది. దేశంతోపాటు రాష్ట్రాలని కోలుకోలేని దెబ్బ తగిలిందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. అయితే ఏది ఏమైనా కరోనా నిరోధక చర్యలకు ఖర్చుకు వెనకాడవద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారంట.
దేశవ్యాప్త లాక్డౌన్ తో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్వాసులను తిరిగి రప్పించకుండా ఆయా ప్రాంతాల్లోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా అక్కడే వారికి వసతి – భోజన సౌకర్యాలు కల్పించేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాలని జగన్ తెలిపారని సమాచారం. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వారికి ఆ రాష్ట్రం వసతి కల్పించకుంటే.. తామే ఆ ఖర్చు భరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రివర్గం నిర్ణయించింది. అయితే ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి వచ్చే పరిస్థితులు లేవని ఒకవేళ వస్తే 14 రోజుల పాటు క్వారంటైన్ విధిగా ఉండాలని స్పష్టం చేసింది.