ఒక వైపు భయంకరంగా కరోనా వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరొక సంచలనమైన నిర్ణయాన్ని తీసుకుందని చెప్పాలి. కాగా ఇప్పటికే కరోనా వైరస్ భయంకరంగా వ్యాపిసున్న కారణంగా రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రులను ప్రభుత్వాధీనంలోకి తీసుకోడానికి నిర్ణయించుకుంది. ప్రైవేట్ ఆస్పత్రుల వైద్య సేవలు, రోగ నిర్ధారణ పరీక్షలు, ఇతర సేవలు అన్ని కూడా ఇక నుండి ప్రభుత్వ ఆధీనంలో జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంబంధిత ఆదేశాలు అధికారికంగా జారీ చేశారు. కరోనా ఎఫెక్ట్ వలన ఆ ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేయనున్నారు.
అంతేకాకుండా ఆ వార్డుల్లో బెడ్స్, ఐసీయూ, వెంటిలేటర్లు, టెస్టింగ్ ల్యాబ్‌లు, ఫార్మసీలు, మార్చురీలు, ఇతర పరికరాలన్నింటినీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనఆధీనంలో పెట్టుకోనుందని సమాచారం. వాటితో పాటే ప్రైవేట్ ఆసుపత్రుల్లో పని చేస్తున్నటువంటి వైద్యులు, నర్సులు, మెడికల్, నాన్ మెడికల్ స్టాఫ్‌ను అందరిని కూడా ప్రభుత్వం తమ సేవలకు వాడుకోనుందని సమాచారం. ఈ మేరకు జిల్లా కలెక్టర్, ప్రత్యేక అధికారి వీటిని పర్యవేక్షించనున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలందరూ కూడా తమ ప్రాణాలపై ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్న సీఎం జగన్ పై ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు.