జగన్మోహన్ రెడ్డి అంశం హాట్ టాపిక్

జగన్మోహన్ రెడ్డి అంశం హాట్ టాపిక్

ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను తక్షణం విచారించాలని.. ఆలస్యం చేయకూడదన్న అంశంపై రాజ్యసభలో జరిగిన చర్చలో.. జగన్మోహన్ రెడ్డి అంశం హాట్ టాపిక్ అయింది. అయితే అది ఆయన కేసుల గురించి చర్చించడం కాదు.. అలా పేరు పెట్టి ఒకరి గురించి చర్చించడం కరెక్ట్ కాదన్న వాదన జరగడం. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇందులో జోక్యం చేసుకుని మరింత రచ్చ చేయడంతో… విషయం కాస్తా హైలెట్ అయిపోయింది. మొదట… ఈ అంశంపై .. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మాట్లాడారు. ఆ సమయంలో ఆయన జగన్ పేరు పెట్టి… ఆయన కేసులు ఆలస్యమవుతున్నాయని ప్రస్తావించారు.

అయితే.. చైర్మన్ వెంకయ్యనాయుడు మాత్రం.. ఈ చర్చ వ్యక్తులకు సంబంధించినది కాదని.. అలా వ్యక్తుల పేర్లు తేవొద్దని సూచించారు. వెంకయ్యనాయుడు అలా సూచించడంతో.. కనకమేడల సైలెంటయిపోయారు. కానీ వెంటనే.. విజయసాయిరెడ్డి కల్పించుకున్నారు. కనకమేడల .. జగన్ పేరును ప్రస్తావించడాన్ని తప్పుబట్టారు. ఇది.. చైర్మన్ వెంకయ్యనాయుడ్ని అసహనానికి గురి చేసింది. సభ్యుడి వ్యాఖ్యలపై స్పందించడానికి మీరు మంత్రి కాదని.. విజయసాయిరెడ్డికి వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. సభా నియమాల గురించి.. తాను చెబుతున్నాని ఎందుకు కల్పించుకుంటారని ప్రశఅనించారు.

చైర్మన్ సీరియస్ అవడంతో.. విజయసాయి కూర్చుండిపోయారు. సీబీఐ కేసుల్లో విచారణను త్వరగా పూర్తి చేయాలని, ప్రజా ప్రతినిధులు, సీఎంలపై ఉన్న కేసుల విచారణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని కనకమేడల చర్చలో అభిప్రాయాన్ని తర్వాత జగన్ పేరు ప్రస్తావించకుండా చెప్పారు. మిగతా సభ్యులు కూడా అదే అభిప్రాయం చెప్పారు. మొదట కనకమేడల జగన్ ప్రస్తావన తెచ్చినప్పుడు… వెంకయ్యనాయుడు వారించారు. దాంతో మళ్లీ జగన్ ప్రస్తావన వచ్చేది కాదు. కానీ.. తాను కల్పించుకోకపోతే ఎట్లా అనుకున్నారేమో కానీ… విజయసాయిరెడ్డి కల్పించుకుని… చర్చ కాస్త కొనసాగేలా చేశారు.