2019 ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం ఎలా ఉంటుందో ఇంకా అర్ధం కావడం లేదు. ఎన్నికలకు ఇంకా ఎనిమిది,తొమ్మిది నెలల సమయం మాత్రమే ఉన్నప్పటికీ పొత్తుల లెక్కలు తేలడం మాట అటుంచి ఎవరు ఎవరితో కలుస్తారో ఊహించడం కూడా కష్టంగా వుంది. జాతీయ స్థాయిలో ప్రధాని మోడీని గద్దె దించడానికి విపక్షాలు ఏకతాటి మీదకు వస్తున్న సంకేతాలు అందుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో కూడా సీఎం చంద్రబాబు ని మిగిలిన అన్ని రాజకీయ పక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.
జాతీయ రాజకీయాల ప్రభావంతో కాంగ్రెస్ మాత్రమే కాస్త ఘాటు తగ్గించి మాట్లాడుతోంది. ఇక మిగిలిన పార్టీలు చంద్రబాబుని ఎంత తొందరగా సీఎం కుర్చీ నుంచి దింపేద్దామా అని కాచుకు కూర్చున్నాయి. అయితే ఇక్కడ రాజకీయం వేరుగా వుంది. విపక్షాలు ఏవీ ఒకరితో ఒకరు కలిసే పరిస్థితి లేకుండా రాజకీయ వాతావరణం చిక్కుముడులు పడిపోయింది. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ అంటే మిగిలిన ఏ పార్టీ కూడా పొత్తుకు సిద్ధంగా లేదు. ఏపీ జనాల్లో ఆ పార్టీ మీద వ్యతిరేకత తమ కొంప ముంచుతుందని మిగిలిన పార్టీలు భయపడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో ప్రజల నాడి పట్టడంలో విఫలం అయిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఆ వాస్తవాలు విస్మరించి వైసీపీ అధినేతకు సన్నిహితుడైన ఓ ఎంపీ తో పొత్తు ప్రస్తావన తెచ్చారంట. మొత్తం 175 స్థానాలకు గాను వైసీపీ 100 చోట్ల , జనసేన 60 చోట్ల , బీజేపీ 15 చోట్ల పోటీ చేసేలా అమిత్ షా ఓ ప్రతిపాదన చేసారంట. అయితే అందుకు జగన్ ససేమిరా అన్నారట. దాని ఫలితమే తాజాగా ఈడీ ఛార్జ్ షీట్ లో భారతి పేరు చేరడం అని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తున్న మాట.
అమిత్ షా చెప్పిన ప్రతిపాదనకు ఒప్పుకుంటే బీజేపీ కి దగ్గర అయినందుకు తనకు గట్టి మద్దతుదారులుగా వున్న ముస్లిం, ఎస్సీ వర్గాల్లో వ్యతిరేకత వస్తుందని జగన్ డౌట్ పడుతున్నారట. అయితే ఈ లెక్కల్ని పట్టించుకోని బీజేపీ కేంద్రంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమ మాట చెల్లుబాటు అయ్యేలా పావులు కదుపుతున్నారు. తాము మునిగేది కాకుండా తనని నమ్ముకున్న వారిని కూడా ముంచేలా బీజేపీ వేస్తున్న ఎత్తులు జగన్ కి చికాకు తెప్పిస్తున్నాయట. ఆ పరిణామాలు చివరకు ఎటు దారి తీస్తాయో ?