Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తాజ్ మహల్ పై యూపీ బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తాజ్ మహల్ ను సందర్శించిన సమయంలోనే ఆగ్రా నార్త్ ఎమ్మెల్యే జగన్ ప్రసాద్ గార్గ్ మరోసారి తాజ్ మహల్ పై వివాదాన్ని లేవనెత్తారు. తాజ్ మహల్ స్థానంలో గతంలో శివాలయం ఉండేదని, దాన్ని కూలగొట్టి షాజహాన్ తాజ్ మహల్ నిర్మించారని జగన్ ప్రసాద్ గార్గ్ ఆరోపించారు. శివాలయం ఉన్న విషయం చాలా మంది చరిత్రకారులకు తెలుసని ఆయన అన్నారు. తాజ్ మహల్ ను సందర్శించేందుకు ఏటా మిలియన్ల మంది పర్యాటకులు వస్తుంటారని, దీని వల్లే ఆగ్రా ప్రసిద్ధికెక్కిందని ఆయన చెప్పారు.
వారం రోజుల క్రితం బీజేపీ ఎంపీ వినయ్ కతియార్, ఎమ్మెల్యే సంగీత్ సోమ్ కూడా తాజ్ మహల్ గురించి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తాజ్ ఒకప్పటి శివాలయమని, అప్పట్లో ఆ ఆలయాన్ని తేజోమహాలయ్ అని పిలిచేవారని తెలిపారు. తాజ్ మహల్ భారత్ కు ఓ మాయని మచ్చని, దాన్ని నిర్మించిన మొఘల్ చక్రవర్తులు దేశద్రోహులని సంగీత్ సోమ్ వ్యాఖ్యానించారు. యూపీ ప్రభుత్వం ఆరునెలల పాలన పూర్తిచేసుకున్న సందర్బంగా పర్యాటక ప్రాంతాలతో విడుదల చేసిన బుక్ లెట్ లో తాజ్ మహల్ పేరులేకపోవడంతో వివాదం చెలరేగింది. సంగీత్ సోమ్, వినయ్ కతియార్ వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత పెద్దది చేశాయి. ఈ నేపథ్యంలో యూపీ ముఖ్యమం
త్రి ఇవాళ తాజ్ మహల్ ను సందర్శించి, ఆ చారిత్రక కట్టడాన్ని ప్రశంసల్లో ముంచెత్తారు. తాజ్ మహల్ ను మరింతగా అభివృద్ధి చేసేందుకు పెద్ద మొత్తంలో నిధులు ఖర్చుచేస్తామని ప్రకటించారు. ఓ వైపు యోగీ తాజ్ మహల్ ను సందర్శిస్తుండగానే…ఆగ్రా నార్త్ ఎమ్మెల్యే…చారిత్రక కట్టడంపై విమర్శలు చేశారు. తాజ్ మహల్ కు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని సమీకరించేందుకే బీజేపీ ఇలా ద్వంద్వ వైఖరి కనబరుస్తోందన్న వాదన వినిపిస్తోంది.