జై లవ కుశ… తెలుగు బులెట్ రివ్యూ

Jai lava Kusa Movie review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :   ఎన్టీఆర్ , నివేద థామస్ , రాశి ఖన్నా , దునియా విజయ్ , అభిమన్యు సింగ్ 
నిర్మాత :     కళ్యాణ్ రామ్ 
దర్శకత్వం :    బాబీ 
మ్యూజిక్ డైరెక్టర్ :  దేవీ శ్రీ ప్రసాద్ 
ఎడిటర్ :      కోటగిరి వెంకటేశ్వర రావు 
సినిమాటోగ్రఫీ : చోటా కె. నాయుడు 

ఎన్టీఆర్ తెలుగు సినిమా  ముద్దు బిడ్డ. ఈ రంగంలో చాలా మందికి ఆయన దైవ సమానుడు. ఆయన అంటే ఎంత ఇష్టమున్నా ఆయన పేరు మీద ఓ బ్యానర్ పెట్టడానికి ఎవరూ సాహసించలేదు. కారణం… ఆయన పేరు పెట్టుకుని ఎక్కడ చెడగొడతామేనన్న భయం. ఆయన పేరుకి తగ్గట్టు సినిమాలు చేయలేమోనన్న అప నమ్మకం. కానీ ఎన్టీఆర్ మనవడు కళ్యాణ్ రామ్ ఆయన పేరు మీద ఓ బ్యానర్ పెట్టడానికి సాహసించాడు. బహుశా ఎన్టీఆర్ బ్లడ్ నుంచి వచ్చిన ధైర్యం కాబోలు. కళ్యాణ్ రామ్ ఆ బ్యానర్ మీద “అతనొక్కడే” అని నిర్మాతగా తొలి సినిమా చేస్తుంటే ఎవరూ పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు. కానీ ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ అంటే కొన్ని అంచనాలు ఏర్పడ్డాయి. కళ్యాణ్ ఓ నిర్మాతగా ఆ అంచనాలు అందుకోడానికి అలుపెరగని ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు. అందులో జయాపజయాలు సహజం.

అయితే ఈ బ్యానర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా అనగానే అందరి దృష్టి ఇటు పడింది. అంతకుముందు ఓ ప్లాప్ తీసిన దర్శకుడు బాబీని సెలెక్ట్ చేసుకోగానే చాలా మంది నొసలు చిట్లించారు. కానీ జై పేరుతో ఎప్పుడైతే టీజర్ విడుదల అయ్యిందో. ఆ చిట్లించిన నొసళ్ళు విప్పారాయి. ఎన్టీఆర్ మూడు పాత్రలు ఎలా ఉంటాయి , ఎప్పుడెప్పుడు వాటిని చూద్దామా అన్న ఆసక్తి బయలుదేరింది. ఒక ఎన్టీఆర్ ని చూస్తుంటేనే తెర మీద మెరుపు తీగ ని చూసినట్టు ఉంటుంది. ఇక ముగ్గురు ఎన్టీఆర్ లు అనగానే ఇంకెలా ఉంటుంది. ఊహకే వళ్ళు పులకరించే ఈ సీన్ జైలవకుశ తో మన ముందుకు వచ్చింది. అవకాశమే హద్దు గా అంచనాలతో వచ్చిన జైలవకుశ ఎలా ఉందో చూసేద్దామా ?

కథ…

ఒకే కుటుంబంలో పుట్టిన ముగ్గురు అన్నదమ్ముల కథ. ఈ ముగ్గురి మనసులు వేరు, రూపం ఒక్కటే. అయితే ఊహించని పరిణామంతో ఆ కుటుంబం చెల్లాచెదురు అవుతుంది. పెద్ద కొడుకు జై కి బాల్యంలో వున్న చేదు జ్ఞాపకాలు అతన్ని కరుడుగట్టిన మనిషిగా మార్చేస్తాయి. లవ కుమార్ మంచితనానికి మారుపేరుగా ఓ బ్యాంకు ఉద్యోగి అవుతాడు. ఇక కుశుడు మోడరన్ కృష్ణ అవతారంలో బండి లాగేస్తుంటాడు. మోడరన్ కృష్ణ అనగానే సరసుఁడు అనుకుంటారేమో. ఈయన గారి కృష్ణ తత్వం చేతివాటానికి పనికొస్తుంది. చిన్న చిన్న దొంగతనాలతో బతికే కుశుడు , లవ కుమార్ అనుకోకుండా కలుస్తారు . లవకుమార్ మంచితనం వల్ల ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించడానికి కుశుడు అతని ప్లేస్ లోకి వెళ్ళిపోతాడు. ఇంతలో ఆ ఇద్దరూ ఊహించని దానవత్వంతో జై సీన్ లోకి ఎంటర్ అయిపోతాడు.

రౌడీయిజం నుంచి రాజకీయంగా ఎదగాలనుకునే జై కి తన వృత్తే అడ్డం వస్తుంది. దాన్ని తొలగించుకోడానికి లవ,కుశ ని ని వాడుకోవాలని డిసైడ్ అయిన జై వారిని కిడ్నాప్ చేయిస్తాడు. అప్పట్లో సద్దాం డూప్ లు ఇరాక్ అధ్యక్ష భవనంలో ఉన్నట్టు అందరూ ఒకే చోటుకి చేరతారు. ఒకరు నిజమైన జై అయితే …అతను చెప్పినట్టు ఆడే యిద్దరు జై లు తయారు అవుతారు. ఒకరికి తనని రాజకీయంగా ఎదిగే పని ,ఇంకొరికి తాను ప్రేమించే అమ్మాయిని తనకు దగ్గర అయేట్టు చేసే పని అప్పగిస్తాడు జై .. ఈ అభినవ రావణుడు తన పని పూర్తి కాగానే లవకుశ ని పైకి పంపాలి అనుకుంటాడు. జై మారతాడని లవకుశ ఎదురు చూస్తుంటారు. ఆ ముగ్గురు అన్నదమ్ముల కథ ఊహించని క్లైమాక్స్ తో ముగుస్తుంది.

విశ్లేషణ…

కసితో సినిమా చేస్తున్నాడు, రాస్తున్నాడు అని ఎవరి గురించి అయినా చెబితే అబ్బా రొటీన్ డబ్బా అనుకునే రోజులు ఇవి. కానీ ఓ ప్లాప్ తో సందిగ్ధంలో పడ్డ బాబీ నిజంగా కసితో జైలవకుశ చేసాడు అనిపిస్తుంది. అందుకే సక్సెస్,ఫెయిల్యూర్ అన్న విషయం పక్కనబెట్టి ఎన్టీఆర్ బాబీకి ఛాన్స్ ఇచ్చాడు. ఓ కమర్షియల్ కధలో ఇంత వినోదం, ఇన్ని మలుపులు, సెంటిమెంట్ చివరిదాకా ఉత్కంఠ, ఊహించని క్లైమాక్స్ …ఇవన్నీ కుదరడం బహు అరుదు. ఇవన్నీ ఉంటూనే ఓ నటుడి విశ్వరూపాన్ని చూపే పాత్ర సృష్టించడం ఇంకా అరుదు. జైలవకుశ తో ఆ ఫీట్ విజయవంతంగా చేసిన దర్శకుడు బాబీని అభినందించాలి.

ఇక ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషిస్తున్నాడు అనగానే అందరిలోనూ ఓ ఆసక్తి , అంచనా. అయితే మీరు ఎంత ఊహించుకుని ఈ సినిమాకి వెళ్లినా సంతృప్తిగా బయటికి వస్తారు. జై పాత్ర టీజర్ బయటికి రాగానే మొత్తం దృష్టి ఆటే పడింది. నిజంగానే జై పాత్రలో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించాడు. జై పాత్ర అనుకుంటే లవకుశ పాత్రలు బోనస్. ఎక్కడా ఒక దానికి ఒకటి సంబంధం లేని మూడు పాత్రల్లో ఎన్టీఆర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇక కొన్ని డాన్స్ మూవ్ మెంట్స్ అదరహో అనిపించాయి. మొత్తానికి ఎన్టీఆర్ జైలవకుశ మీద పెట్టుకున్న నమ్మకం వమ్ముకాలేదు. ఆయన మీద జనం పెట్టుకున్న నమ్మకం జైలవకుశ తో రెట్టింపు అయ్యింది.

ఈ సినిమాలో మిగిలిన పాత్రలు కూడా బాగా పండాయి. సాయి కుమార్ తో పాటు నివేద థామస్ కూడా ఎన్టీఆర్ విశ్వరూపం ముందు కూడా నిలిచేలా స్క్రీన్ ప్రెజన్స్ ఇచ్చారు. ఇక మ్యూజిక్ పరంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్. జై పాత్రకి ఇచ్చిన అసుర థీమ్ బావుంది. ఛోటా కె . నాయుడు పనితనం ఎప్పటిలాగానే సూపర్. ఇక ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ విలువలు ఈ సినిమా రేంజ్ పెంచే విధంగా వున్నాయి.

ప్లస్ పాయింట్స్ ..

కథ , స్రీన్ ప్లే
దర్శకత్వం
ఎన్టీఆర్ నటన

మైనస్ పాయింట్స్…

సెకండ్ హాఫ్ లో ఒకటిరెండు సీన్స్ లాగ్

తెలుగు బులెట్ పంచ్ లైన్ … “జైలవకుశ “ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపింది.
తెలుగు బులెట్ రేటింగ్… 3 . 5 / 5 .