Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అవిశ్వాస తీర్మానాలపై చర్చ చేపట్టకుండా లోక్ సభను నిరవధిక వాయిదా వేయడంపై సీపీఎం, సీపీఐ మండిపడ్డాయి. పాదయాత్ర ముగిసిన అనంతరం విజయవాడలో మీడియా సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడారు. సీపీఐ, సీపీఎం, జనసేన నిర్వహించిన పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వస్పందన వచ్చిందని మధు తెలిపారు. పార్లమెంట్ లో అవిశ్వాసంపై చర్చ జరపడానికి అవకాశం లేకుండా పోయిందని, అందుకే తాము ప్రజాక్షేత్రంలో పోరాటం కొనసాగిస్తున్నామని చెప్పారు. నలుగురు ఎంపీలు అడ్డుకుంటే అవిశ్వాసతీర్మానంపై చర్చను తిరస్కరించడమేమిటని మధు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేశారు.
పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానానికి అవకాశం ఇవ్వకపోవడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తంచేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు వల్లే కేంద్ర సర్కార్ పై టీడీపీ, వైసీపీలు అవిశ్వాసతీర్మానం పెట్టే వరకు పోరాటం వెళ్లిందన్నారు. శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి తాము వెళ్లడం లేదని, గత సమావేశంలోనే తమ అభిప్రాయం చెప్పామని వెల్లడించారు. చంద్రబాబులో చిత్తశుద్ధి కనిపించడం లేదని, అప్పుడే ప్యాకేజీకి ఒప్పుకోకుండా హోదాపై పట్టుబట్టి ఉంటే బాగుండేదని రామకృష్ణ విమర్శించారు.