Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇన్నాళ్లూ ట్విట్టర్ వేదికగా రాజకీయ పార్టీ నడిపిన జనసేనానికి లండన్ పర్యటన తర్వాత కనువిప్పు కలిగింది. ప్రజల సాధకబాధకాలు తెలియాలంటే జనం మధ్యకు వెళ్లక తప్పదని పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర గడువే ఉండడంతో ట్విట్టర్ రాజకీయాలు పనిచేయవని అర్ధం చేసుకున్నారు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు విడతలుగా పర్యటన చేపట్టారు. యువతే లక్ష్యంగా పవన్ రాజకీయ కార్యాచరణ రూపొందించుకున్నట్టు తెలుస్తోంది. జనసేనకు పవన్ అభిమానులే వెన్నెముక. వారంతా ఎక్కువగా మధ్యతరగతికి చెందిన యువతీ యువకులే. అందుకే ఆయన ప్రసంగాలు, పోరాటాలు యువత చుట్టూనే తిరగనున్నాయి. తన పర్యటనకు ముందు యువతను జాగృతం చేయడానికి చలో రే చల్ పాటను విడుదల చేయడమే ఇందుకు నిదర్శనం.
నిజానికి వేల మాటలు చెప్పలేని విషయాన్ని ఒక్క పాటతో తెలియజేయవచ్చు. సంగీతంతో కలిసి వచ్చే ఆ పాట మనిషి మెదడులో నిక్షిప్తమైపోయి కొత్త ఆలోచనలు కలగజేస్తుంది. అందుకే రాజకీయ పార్టీలు తమ ప్రచారంలో ప్రత్యేకంగా పాటలను కంపోజ్ చేయించుకుని మరీ ఉపయోగించుకుంటాయి. ఎన్టీఆర్ టీడీపీ పెట్టినప్పుడు చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా పాటను విస్తృతంగా వాడుకున్నారు. వేములపల్లి శ్రీకృష్ణ రాసిన ఈ పాట ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్లినా వినిపించేది. ఈ పాట టీడీపీకి ఎంత ప్రజాదరణ పెంచిందో చెప్పడానికి ఓ ఉదాహరణ చెప్తుంటారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్ తిరుపతి సభలో ప్రసంగించాల్సిఉంది. అయితే ఆయన కన్నా ముందుగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తిరుపతిలో సభ ఏర్పాటుచేశారు. ఎన్టీఆర్ రావడానికి ఆలస్యం ఉండడంతో ప్రజలంతా ఇందిర సభకు వెళ్లారు.
ఎన్టీఆర్ తిరుపతి రాగానే.. స్థానిక నాయకులు ఇందిర సభ విషయం చెప్పారు. ప్రజలంతా ఆ సభలోనే ఉండడంతో ఎన్టీఆర్ సభకు ఎవరూ రారేమోనని స్థానిక నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. ఎన్టీఆర్ మాత్రం ఏమాత్రం ఆందోళన పడకుండా చెయ్యెత్తి జై కొట్టు పాటను పెద్ద సౌండ్ తో ప్లే చేయమన్నారు. పాట అలా వినిపించిందో లేదో…ఇందిర సభలోని జనమంతా పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ఉన్న చోటకి తరలివచ్చారు. అంతలా ఆ పాట ప్రజాదరణ పొందింది. ఇప్పుడు జనసేనాని కూడా ఆ బాటలోనే నడుస్తున్నారు. తన పర్యటనకి చలో రే చలో రే చల్ గీతాన్ని విడుదల చేశారు. ఈ పాట ఆయన జల్సా సినిమాలోనిదే. అయితే చలో రే చలో రే చల్ వాక్యాలను తీసుకుని.. వాటికి పవన్ ఆవేశపూరితంగా చెప్పే కొన్ని డైలాగ్స్ జతచేసి పాట విడుదల చేశారు. ఇక జనసేనాని తిరిగే చోటల్లా ఈ పాట వినిపిస్తుందన్నమాట. వెనకాలే వస్తారా.. తోడుగా వస్తారా… అని కోరుతున్న పవన్ వెంట ఎంతమంది యువత నడవనుందో కాలమే చెప్పాలి.