ఆలు లేదు చూలు లేదు కొడుకుపేరు సోమలింగం అని ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తానని ప్రకటించన పవన్ అందుకు తగ్గట్టు ఏమీ ప్రయత్నాలు చేసినట్టు కనపడకపోయినా అయ్యవారు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ఆయన దృష్టి సారించారు. ఏపీలో అధికార ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్న పవన్ హఠాత్తుగా యూపీ రాజధాని లక్నోకు బయలుదేరారు. ఏమాత్రం ముందస్తు ప్రణాళిక, మీడియాకు సమాచారం లేకుండా జనసేన అధినేత పవన్ కల్యాణ్, లక్నోకు బయలుదేరి వెళ్లారు. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతిని కలిసి, ఆమెతో చర్చలు జరిపేందుకే పవన్ వెళ్లినట్టు తెలుస్తోంది. మాయావతితో పాటు ఆయన మరికొందరు నేతలనూ పవన్ కలుస్తారని సమాచారం. వీరిమధ్య సాగే చర్చలపై ఎటువంటి సమాచారం లేకున్నా, బీజేపీకి వ్యతిరేకంగా ప్రారంభించాలని చూస్తున్న రాజకీయ పార్టీల కూటమిపై చర్చించేందుకు పవన్ వెళ్లినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. మాయావతితో పాటు అఖిలేష్ యాదవ్ నూ పవన్ కలిసే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.
అయితే పవన్ కళ్యాణ్ తృతీయ కూటమి కోసం చర్చలు జరిపేందుకు వెళ్లి ఉంటారని కూడా మరికొందరు భావిస్తున్నారు. అయితే ఇంతకు ముందే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ కోసం కేసీఆర్ గతంలో ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకోసం ఆయన పశ్చిమ బెంగాల్, కర్ణాటక తదితర చోట్లకు వెళ్లి మమతా బెనర్జీ, దేవేగౌడలను కూడా కలిశారు. మరోవైపు, చంద్రబాబు కూడా తొలుత బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే తాజా పరిణామాలని బట్టి బేరీజు వేస్తే ఆయన కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీ వ్యతిరేక కూటమి అయిన కాంగ్రెస్‌లో చేరే అవకాశముంది.
ఇప్పుడు కేసీఆర్ ముందస్తు హడావుడిలో, చంద్రబాబు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. మరోపక్క కేసీఆర్ మోడీతో భేటీల తర్వాత బీజేపీ మీద తగ్గిన మాటల వాడిని బట్టి చూస్తే ఎదో లోపాయికారీ ఒప్పందమో ఉందా ? అని అనుమానం కలగక మానదు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మరో కీలక నేతగా ఎదుగుతున్న పవన్ కళ్యాణ్ థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు చేస్తున్నారా అనే చర్చ సాగుతోంది. మాయావతి, అఖిలేష్ యాదవ్, ఇతర జాతీయస్థాయి నేతలను కలవడం ద్వారా పవన్ కళ్యాణ్ ఇదే సందేశాన్ని ఇస్తున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు. టీడీపీ నేతలు బీజేపీ ఆడిస్తున్న నేతగా ఆరోపణలు చేస్తున్నప్పటికీ లెఫ్ట్ పార్టీలకు దగ్గరగా ఉంటూ పవన్ మాత్రం తాను బీజేపీకి దూరమనే సంకేతాలు ఇప్పటికే ఇచ్చారు. అలాగే అంతేకాకుండా ఎస్సీల పార్టీగా ముద్రపడ్డ బీఎస్పీతో పవన్ మంతనాలు జరపనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.