‘నేను వచ్చింది అధికారం కోసం కాదు ప్రశ్నించడానికి మాత్రమే’ అనే సరికొత్త ట్యాగ్ లైన్ తో రాజకీయాలలోకి వచ్చారు పవన్ కళ్యాణ్. రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతోనే పవన్ ప్రభంజనం సృష్టిస్తాడనుకున్నారు ఆయన అభిమానులు అందుకు అనుగుణంగానే ప్రజల తరుపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని ‘జనసేన’ పార్టీ కూడా ఏర్పాటు చేశాడు. పార్టీ ఏర్పాటు సమయంలోనే తన ఆవేశపూరిత ప్రసంగాలతో అందరి దృష్టిలో పడ్డాడు. అయితే పార్టీ పెట్టిన కొన్ని రోజులుకే పవన్… బీజేపీతో పొత్తు కుదుర్చుకుని- బీజేపీ-టీడీపీ ఎన్నికల ప్రచారసభలలో తనదైన శైలిలో ఉద్రేకంగా ప్రసంగాలను కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారు.
పార్టీ నిర్మాణం జరగలేదు… సరైన విధి విధానాలు లేవు డబ్బు లేదు… కాబట్టి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఓట్లు చీల్చకుండా ఓ అనుభవగ్నుడికి వత్తాసు పలికాడని అందరూ నమ్మారు. అయితే ఎప్పటికపుడు అతను తన సిసలైన రాజకేయ నాయకుడి ముసుగులు తీస్తూ వచ్చాడు. తెలుగు దేశం -భాజపా కూటమికి నాలుగేళ్ళు పాటు మద్దతు ఇచ్చి ఎప్పటి నుండో ఉన్న ఉద్దానం కిడ్నీ సమస్య తప్ప పెద్దగా ప్రశ్నించని పవన్, చంద్రబాబు కంటే సమర్దుడయిన నాయకుడు లేదని పొగిడిన నోటి తోనే 15 రోజుల్లోనే యూటర్న్ తీసుకుని బాబు అవినీతి పరుడని వ్యాఖ్యలు చేసి తాను ఇప్పటి వరకు వేసుకున్న ప్రజా నాయకుడి ముసుగు తొలగించేసి రాజకీయ నాయకుడిగా ప్రజలకి దర్శనం ఇచ్చేశాడు.
ఇదొక్కటే ఉదాహరణ అయితే బాగానే ఉండేది. ఇప్పుడు తాజాగా పవన్ పార్టీ నేతలు చేసిన మరో పని ఆయన పూర్తి రాజకీయ నాయకుడు అని, ప్రజలకి అర్ధమయ్యేలా చేసింది. ఒకప్పుడు తానూ పంచెలు ఊడదీస్తాను అని హెచ్చరించిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడిని చేర్చుకున్న పవన్ ఇప్పుడు అదే పార్టీ లో సుదీర్ఘ కాలం ప్రయాణం చేసి ఇప్పుడు తెలుగుదేశం నుండి ఎంపీగా ఉన్న జేసి దివాకర్ రెడ్డి ని తన పార్టీ లోకి రమ్మని రాయబారం పంపారట. ఈ విషయాన్నీ స్వయంగా జేసీ నే బయట పెట్టారు. జనసేన పార్టీలోకి రావాలంటూ పవన్ తరపున కొందరు వ్యక్తులు తనను ఆహ్వానించారని పేర్కొన్నారు. అయితే, ఆ ఆఫర్ను తాను తిరస్కరించానని అన్నారు, పార్టీ మారేది లేదని తేల్చి చెప్పానన్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో జనసేన గల్లంతవడం ఖాయమన్నారు.
ఇదంతా చూస్తుంటే ఎలా అయితే చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన సమయంలో అన్ని పార్టీల నుండి వచ్చిన నేతలందరినీ కలుపుకుని ఎన్నికలకి వెళ్లి బొక్క బోర్లా పడ్డారో పవన్ కూడా అదే దారిలో పయనిస్తున్నట్టు అనిపిస్తోంది. ఎటూ కొత్తగా రాజకీయాలలోకి వచ్చే వాళ్ళు తప్ప పార్టీలో అనుభవమున్న నాయకులూ లేకపోవడంతో పవన్ ఇలా సీనియర్ల వెంట పడ్డారు అనుకోవచ్చు. ఆ కారణంతోనే ఫక్తు రాజకీయ పార్టీల ఆయుధం అయిన ఆపరేషన్ ఆకర్ష ని నమ్ముకుని ఉండచ్చు. ఇలానే చేస్తే అప్పటి ప్రజారాజ్యం లాగానే వోట్లు చీల్చడానికి జనసేన ఉపయోగపడచ్చేమో గాని లాంగ్ రన్ లో మాత్రం నిలబడలేదు అనేది విశ్లేషకుల వాదన, అయితే ఏమవుతుందో అనేది కాలమే నిర్ణయించాలి మరి.